KCR : నమస్తే.. నీకోదండం.. కేసీఆర్‌ ఇజ్జత్‌ తీయకమ్మా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావొస్తున్నా రాజకీ వేడి తగ్గడం లేదు. తగ్గే అవకాశం కనిపించడం లేదు. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

Written By: Raj Shekar, Updated On : September 1, 2024 12:05 pm

KCR

Follow us on

KCR : తెలంగాణలో గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉద్యమ పార్టీగా 2014, 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటర్లు పట్టం కట్టారు. తెలంగాణను కేసీఆర్‌ కూడా ఉద్యమం తరహాలోనే అభివృద్ధి చేశారు. కానీ, ఏ నినాదాలతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ నినాదాల్లో కేవలం నీళ్లు మాత్రమే పదేళ్లలో నెరవేర్చగలిగారు. అయితే లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి కేసీఆర్‌ వైఫల్యాలను బయటపెట్టింది. అప్పటి నుంచే కేసీఆర్‌ కుంగుబాటు మొదలైంది. గత రెండు ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడు 2023 నవంబర్‌ ఎన్నికల్లో కనిపించలేదు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు.. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు హస్తం పార్టీని ప్రజలు అందలం ఎక్కించేలా చేశాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కాస్త సైలెంట్‌ అయ్యారు. అయితే ఇందుకు వేర్వేరు ఆరణాలు ఉన్నాయి. కానీ బీఆర్‌ఎస్‌ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తంది. అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇదే బీఆర్‌ఎస్‌కు పెద్ద ప్లస్‌పాయింట్‌. అయితే అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కూడా ప్రతిపక్ష నేత తరహాలోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హీట్‌ తగ్గడం లేదు.

ప్రజల్లోకి కేసీఆర్‌..
ఇక కేసీఆర్‌ ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నట్లు బీఆర్‌ఎస్‌ అనుకూల మీడియా పెద్దపెద్ద శీర్షికలతో కథనాలు రాస్తుంది. ఛానెళ్లలో కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఇందులో కేసీఆర్‌ సొంత పత్రిక నమస్తే తెలంగాణ మాత్రం ఆయన పరువు తీసేలా కథనాలు రాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసీఆర్‌ ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయ్యారు.. 9 నెలల తర్వాత పార్టీ నేతల విన్నపంతో మళ్లీ యాక్టివ్‌ కాబోతున్నారు. అని ఓ కథనం రాసింది. ఇది చూసి రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేత. ఆయనకు ఎప్పుడు అగ్రెసివ్‌గా ఉండాలి ఎపుపడు యాక్టివ్‌గా ఉండాలో బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేర్పరి. కానీ, నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం కేసీఆర్‌ ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయ్యారని రాసింది. అంటే కేసీఆర్‌ భయపడ్డారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అని అర్థం వచ్చేలా ప్రస్తావించింది. అంతేకాదు.. పార్టీ నేతలు కాంగ్రెస్‌ పాలనలో ఇబ్బంది పడుతున్నారు… వాళ్లు వచ్చి పార్టీని కాపాడాలి అని వేడుకుంటేనే కేసీఆర్‌ మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారని పేర్కొంది.

పార్టీ అధినేత కేసీఆర్‌..
కేసీఆర్‌కు ఎవరో చెబితేగానీ పార్టీ పరిస్థితి తెలియంది కాదు. కేసీఆర్‌ మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తుపాను ముందు ప్రశాంతతలాంటిది కేసీఆర్‌ మౌనం. కానీ, పార్టీ నేతలు చెబితేగానీ కేసీఆర్‌ తెలుసుకోలేదు.. అన్నట్లుగా నమస్తే తెలంగాణ కథనం సాగింది. ఇది రాజకీయ విశ్లేషకులను కేసీఆర్‌ను మొదటి నుంచి గమనిస్తున్నవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి కథనాలు కేసీఆర్‌కు ఎలాంటి లాభం చేకూర్చకపోగా.. ఉన్న పరువు తీస్తాయని పేర్కొంంటున్నారు. బలహీనుడు అని అర్థం వచ్చేలా కథనం రాయడం తీవ్ర నష్టం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం విఫలమైతే కేసీఆర్‌కు బ్రహ్మరథం..
ఇక కేసీఆర్‌ అనుకూల మీడియా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తొమ్మిది నెలలకే ప్రజల్లో విరక్తి వచ్చిందన్నట్లు కథనాలు వస్తున్నాయి. కానీ, వాస్తవంగా ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానం కూడా గెలవలేదు. అంటే వ్యతిరేకత కాంగ్రెస్‌పై కాదు.. బీఆర్‌ఎస్‌పైనే ఉందన్నమాట. ఈ విషయం తెలిసే కేసీఆర్‌ ఇన్నాళ్లు సైలెంట్‌ అయ్యారు. కానీ బీఆర్‌ఎస్‌ ఎక్కడా సైలెంట్‌ కాలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు కొంతమంది నేతలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తన కూతురు కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ, ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుంటే.. కేసీఆర్‌ జనంలోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు.