Godavari District : మా అల్లుడు బంగారం..100 పిండివంటలతో ఆషాడ ఆతిథ్యం.. గోదావరి జిల్లాలా మజాకా!

సాధారణంగా ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే అత్తారింట్లో ప్రత్యేక ఆతిథ్యం లభిస్తుంది. కానీ గోదావరి జిల్లాలో అయితే.. ఊహించిన దాని కంటే మించి ఆతిథ్యం దక్కుతుంది. అక్కడ ప్రత్యేకత కూడా అదే.

Written By: Dharma, Updated On : August 11, 2024 11:25 am
Follow us on

Godavari District : మర్యాదలకు కేరాఫ్ గోదావరి జిల్లాలు. ఇంటికి కొత్త అల్లుడి వస్తే ఆ సందడే వేరు. రకరకాల పిండి వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచేత్తుతారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు అయితే తమ మర్యాద చూపించేదాకా వదలరు. వందలాది రకాల వంటకాలతో ఆతిధ్యం ఇస్తారు. అంతే మర్యాదతో ఇంటిల్లపాది వడ్డింపులు చేస్తారు. దగ్గర ఉండి వడ్డాపన చేస్తారు. ఇతర ప్రాంతాలకు చెందిన అల్లుళ్లు అయితే.. వారి చేసే మర్యాదకు ఆశ్చర్యపోతారు. ముద్దులవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గోదావరి అల్లుళ్లు అయితే వారికిచ్చే గౌరవం వేరు. ఇక కొత్త అల్లుళ్లకు అయితే పిండి వంటలు, పసందైన ఆహార పదార్థాలతో ఆతిథ్యం ఇస్తారు. ఊహించని బహుమానాలను ఇచ్చి వారిలో సంతృప్తి తో పాటు ఆశ్చర్యం వ్యక్తం అయ్యేలా చేస్తారు. అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆషాడం అనంతరం అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు వంద రకాల పిండి వంటల రుచి చూపించారు. ఏకంగా అరటి ఆకు వేసి కొత్త అల్లుడితోపాటు కుమార్తెకు భోజనాలు పెట్టారు. అయితే వంద రకాల పిండి వంటలు కావడంతో తినడం అసాధ్యం. అనంతరం వాటిని ఇరుగుపొరుగు వారికి, గ్రామస్తులకు పంచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ లో వెలుగు చూసింది ఈ ఘటన. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరటి ఆకుపై వందరకాల పిండి వంటలు, వాటి ముందు నూతన వధూవరులు ఉన్న హల్చల్ చేస్తోంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

* వినూత్నంగా ఆతిథ్యం
పశ్చిమగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉదగిరి వెంకన్నబాబు, రమణి దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారికి ఇటీవల వివాహం జరిగింది. కాకినాడకు చెందిన బాదం రవితేజతో పెళ్లి చేశారు. అల్లుడికి మొదటి ఆషాడం కావడంతో వినూత్నంగా ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. ఇంట్లో పెద్ద అరటి ఆకు వేసి అందులో వంద రకాల పిండి వంటలను అందంగా ఉంచారు. ఒక్కసారిగా ఏర్పాట్లు చూసిన రవితేజ ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఈ ఫోటోలను తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

* సంక్రాంతిలో చెప్పనవసరం లేదు
గోదావరి మర్యాదలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా సంక్రాంతి సమయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అక్కడ కోడిపందాలతో పాటు అతిధి మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. అతిధుల అభిరుచికి తగ్గట్టు అక్కడ ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అందుకే గోదావరి అల్లుళ్లు అయితే సంక్రాంతి సమయంలో వారి సందడే వేరు. ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులను సైతం ఆహ్వానిస్తారు ఆ సమయంలో.

* నిజంగా మర్యాద రామన్నలే
గోదావరి జిల్లాల ప్రజలకు మర్యాదరామన్నలు అన్న పేరు ఉంది. బంధుమిత్రులతో పాటు స్నేహితులకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. స్నేహితులకు ఆహ్వానించి కడుపునిండా సంతృప్తికర భోజనం పెడతారు. అందుకే గోదావరి జిల్లాలో స్నేహితులు ఉన్నారంటే.. ఎప్పుడు సంక్రాంతి వస్తుందా? ఎప్పుడు వారు ఆహ్వానిస్తారా? అని ఎదురు చూస్తుంటారు. అటు అల్లుళ్ళ పరిస్థితి కూడా అదే. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాదు ఖాళీ అవుతుంది. భాగ్యనగరం నుంచి ఎక్కువమంది మిత్రులు గోదావరి జిల్లాలకు వస్తారు.