Telangana TDP : తెలంగాణలో బలపడాలని టిడిపి భావిస్తోందా? ఇది సరైన సమయమని అంచనా వేస్తోందా? రెండు జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీగా ఎదగాలని చూస్తోందా? బిఆర్ఎస్ నిర్వీర్యం అయిన వేళ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని డిసైడ్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లపాటు కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఒక వెలుగు వెలిగింది. కానీ 2023 ఎన్నికల్లో ఓటమితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాకపోవడంతో పూర్తి నైరాస్యంలోకి వెళ్ళిపోయింది. ఒకవైపు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు కాంగ్రెస్ లోకి చేరికలు పెరగడంతో ఆందోళనతో ఉంది. దాదాపు జిల్లాకు జిల్లాలే ఖాళీ అవుతున్నాయి. అటు బిజెపి సైతం పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. బిఆర్ఎస్ బిజెపి సాయాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా బిజెపి సైతం కెసిఆర్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్ చెప్పుకొచ్చారు. కానీ అదే కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు. అందుకే కేసిఆర్ ను నమ్మడం విషయంలో బిజెపి చాలా రకాల సమీకరణలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోరాటం నడుస్తోంది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ బలహీనపడింది. ఆ పాత్ర పోషించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇదే సరైన సమయం గా చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
* టిడిపి నేతలంతా కేసిఆర్ పార్టీలోకి..
2014లో టిఆర్ఎస్ గెలిచింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సైతం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. అప్పటివరకు ఉద్యమ తెలంగాణ అన్న కేసిఆర్ రూట్ మార్చారు. బంగారు తెలంగాణ పేరిట.. పాలనాపరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు టిడిపి నేతలను తన వైపు తిప్పుకున్నారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలు టిఆర్ఎస్ లో చేరారు. క్యాబినెట్లో సైతం చోటు దక్కించుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ పూర్వ టిడిపి నాయకులకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. కీలక పదవులు కట్టబెట్టారు. దాదాపు కేసీఆర్ మంత్రివర్గంలో 90 శాతం మంది పూర్వపు టిడిపి నాయకులే.
* ఉనికి కోల్పోతున్న బిఆర్ఎస్
అయితే ఇప్పుడు కెసిఆర్ పార్టీ పరిస్థితి బాగాలేదు. కనీసం ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతోంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు పెరిగాయి. అయితే పూర్వ తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి అయీష్టంగానే వెళ్తున్నారు. ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేకపోవడంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తే.. పూర్వపు టిడిపి నాయకులంతా తిరిగి పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్నను టిడిపి ట్రస్ట్ భవన్ కు వెళ్లి తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. సభ్యత్వ నమోదు పూర్తి చేసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
* క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు
ప్రస్తుతం తిరుగులేని మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. జాతీయస్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి సమయంలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.అవసరమైతే ఏపీలో పొత్తు మాదిరిగా… బిజెపితో కలిసి వెళ్లేందుకు కూడా వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.