YSRCP alliance: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ వెనక్కి తగ్గుతుందా? టిడిపి కూటమికి ధీటుగా మరోకూటమి కట్టనుందా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ బలం కూడదీసుకుని పోరాటం చేయడం ప్రారంభించారు. ఒకవైపు పార్టీని ఆక్టివ్ చేస్తూనే మిగతా రాజకీయ పార్టీలతో అప్పటి వైసిపి ప్రభుత్వం పై పోరాటం చేశారు. చివరకు మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అలబోక విజయం సాధించారు. టిడిపి గెలుపు అనేది పొత్తు ద్వారా సాధ్యం అనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అదే పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యింది. ఇన్నాళ్లు సింగిల్ పార్టీ.. ఒంటరి పోరాటం అన్న మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించేది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కూటమి కట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రకరకాల ఊహాగానాలు..
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) కూటమి కడితే ఏ పార్టీలు చేరుతాయి? ఏ ఏ పార్టీలు చేరే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ స్టాండ్ స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ పార్టీ టిడిపితో వెళ్లేందుకు మొగ్గు చూపుతోంది. జనసేన మరో 15 ఏళ్ల పాటు కూటమి నిలబడాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ మూడు పార్టీల మధ్య పొత్తు విచ్చిన్నం చేయడం కుదరదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది వామపక్షాలతో పాటు కాంగ్రెస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని జగన్ పట్టించుకోరు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో కలిసేందుకు మొగ్గుచూపుతారు అన్నది ఒక అంచనా. ఎందుకంటే వామపక్షాలు కలిస్తే ప్రజా ఉద్యమాలకు చాలా సులువు అవుతుంది. మున్ముందు ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజల్లోకి బలంగా వెళ్లగలరు.
సిపిఐ కార్యదర్శి పిలుపు..
తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య( CPI state secretary Eshwarya ) ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ పై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది. నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఈనెల 18న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. అదే రోజు సిపిఐ సైతం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేద విద్యార్థులను వైద్య విద్యను దూరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ లైన్ లోకి సిపిఐ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏపీలో వైసీపీ కూటమి కట్టేందుకు అనుకూల సమయం అన్న వాదన వినిపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.