Jagan overjoyed: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతోంది. నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. భారీగా జన సమీకరణ చేయగలిగింది. వాటిని సక్సెస్ గా చూపుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని ప్రచారం చేస్తోంది. అయితే ఒక ప్రతిపక్షంగా ఆ పార్టీ అలా చెప్పడంలో తప్పులేదు కానీ.. క్షేత్రస్థాయిలో ఉన్న తప్పులను సరి చేసుకోకుండా ముందుకెళ్తే మాత్రం ఆ పార్టీ ప్రమాదంలో పడడం ఖాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంది. అది కాదనలేని సత్యం కూడా. అయితే ఎటు వచ్చి నాయకత్వం లోటు కనిపిస్తోంది. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకత్వానికి డ్యామేజ్ జరిగింది. కొందరు నేతలు బయటకు వెళ్లిపోయారు. ఉన్న నేతలు యాక్టివ్ కావడం లేదు. కనీసం క్యాడర్ను పట్టించుకునే వారు లేరు. దానిలో మార్పు తేకుండా ప్రజా ఉద్యమాలు పేరిట సమయాన్ని వృధా చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ ట్రెండ్ కు చెల్లు చీటీ..
ఎలాంటి రాజకీయ పార్టీ పిలుపు ఇచ్చినా.. జన సమీకరణ చేసిన జనాలు పోగు అవుతారు. వైసిపి ఐదేళ్ల కాలంలో ఇది గమనించాం కూడా. అయితే ఈ ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది. జనాన్ని చూసి గెలుపు లెక్కలు వేసుకోవడం అనేది తప్పు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కానీ ఎందుకో పార్టీ నాయకత్వం గుర్తించడం లేదు. ఇప్పటికి జనాన్ని చూసి మురిసిపోతోంది. అదే తమ బలంగా చెబుతోంది. ఇక పుంజుకున్నామని.. తమకు ఇంకా తిరుగు లేదని భావిస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితిని గమనించడం లేదు. నాయకత్వం లోటును అస్సలు లెక్క చేయడం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోనే ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు.
అభ్యర్థులను మార్చి..
2024 ఎన్నికల్లో దాదాపు 80 నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని మార్చారు. నేతలపై వ్యతిరేకత ఉందని చెప్పి మరో నియోజకవర్గానికి పంపించారు. అయితే ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే.. మన ఇంట్లో చెత్తను తీసి పక్క ఇంట్లో పారబోసినట్టు ఉంది. అలానే చేశారు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థిని మార్చారు.. తన ముఖం చూసి ఓటేస్తారని అతిథీమాకు వెళ్లిపోయారు. ఆ ధీమాతోనే ఎన్నికలకు వెళ్లి దారుణంగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు కూడా 100 నియోజకవర్గాల్లో నాయకత్వం లేదన్న విషయాన్ని గ్రహించలేదు. కానీ జిల్లా కేంద్రంలో వేలాది మందితో జరిగిన ఆందోళనలను చూసి మురిసిపోతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఒక అంచనా వేసేస్తున్నారు. అయితే ఇటువంటివి మానుకొని గ్రౌండ్ లెవెల్ లో పార్టీపై దృష్టి పెట్టకపోతే మాత్రం.. ఆ పార్టీకి మరోసారి ఇబ్బందులు తప్పవు.