Viral video : భారీ వర్షాల వేళ అమరావతిని ఆడుకుంటున్న వైసీపీ శ్రేణులు

వేల కోట్లు అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అమ్మ ఒడి నుంచి జగనన్న గోరుముద్ద వరకు పథకాలు అమలు చేసినప్పటికీ రెండవసారి అధికారం దక్కకుండా పోయింది. వై నాట్ 175 అనుకుంటే 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్థూలంగా చూస్తే ఇటీవల ఎన్నికల్లో వైసిపికి ఇది కనివిని ఎరగని స్థాయిలో ఓటమి. ఈ ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. సోషల్ మీడియాలో తమ అక్కసు మొత్తం వెళ్లగక్కుతున్నాయి..

Written By: Dharma, Updated On : September 3, 2024 10:56 am

Floods In Amaravathi

Follow us on

Viral video :  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు మూలన పడిన అమరావతి ప్రాంతాన్ని పునరుద్ధరించే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఇటీవల బడ్జెట్లో రాజధాని కోసం కేంద్రం 15వేల కోట్లు కేటాయించింది. సహజంగానే ఈ పరిణామం వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే గత ఐదు ఏళ్ళు రాజధాని పరిసర ప్రాంతాలను వైసీపీ ప్రాంతం పట్టించుకోలేదు. పైగా అది ముంపు ప్రాంతం అని తేల్చేసింది. తెరపైకి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయితే మూడు రాజధానులను అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనలు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని చెప్పినప్పటికీ.. అక్కడ ఊహించినంత స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. పైగా రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ వివాదాస్పదమైంది. ఇన్ని పరిణామాల మధ్య వైసిపి అధికారాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై విచారణ మొదలు పెట్టింది. ఇది జరుగుతుండగానే విస్తారమైన వర్షాలు కురవడం మొదలుపెట్టాయి. మున్నేరు, బుడమేరు విజయవాడను ముంచెత్తడం ప్రారంభించాయి.

వరద నీటి వల్ల..

వరద నీటి వల్ల విజయవాడ, గుంటూరు ప్రాంతాలు నీట మునిగాయి. రాజధాని అమరావతి ప్రాంతం కూడా ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. ఇక ఇదే అదునుగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. టిడిపి అనుకూల మీడియాలో వచ్చిన వార్తలను, అమరావతి ప్రాంతం నీట మునిగిన దృశ్యాలను అనుసంధానం చేస్తూ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాయి.. దీంతో అటు టిడిపి శ్రేణులు, ఇటు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. బుడమేరు కాల్వను తీసి ఉంటే ఈ స్థాయి వరదలు వచ్చి ఉండేవి కాదు కదా అని టిడిపి శ్రేణులు అంటుంటే.. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేస్తే.. భవిష్యత్తు కాలంలో అమరావతి వానలు కురిసినప్పుడల్లా ఇలానే మునిగిపోతుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.. మరోవైపు వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో రాజకీయాలకు పాల్పడడం ఏంటని రెండు పార్టీల నాయకులను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి తీరు సరికాదని దుమ్మెత్తి పోస్తున్నారు. “వర్షాలు కురుస్తున్నాయి. వరద ముంచేస్తోంది. ఇలాంటి సమయంలో రాజకీయాలు ఏంటి. ఆ స్థాయిలో వర్షం కురిస్తే ఈ రాజధాని మాత్రమే కాదు ఏ రాజధాని అయినా నిండా మునుగుతుంది. ఆ మాత్రం తెలియదా..” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి సరికాదని హితవు పలుకుతున్నారు.