Politics on Flood : వరద సహాయ చర్యల్లో ఏపీ సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఈ వయసులో కూడా తెల్లవారుజాము 4 గంటల వరకు తిరుగుతూ..బాధితులకు ధైర్యం చెబుతూ..సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇది రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడడం లేదు. ప్రజల్లో చంద్రబాబుపై వస్తున్న సానుకూలత నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే ఈ విషయంలో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రచార యావ తోనే గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సహాయ చర్యలను ప్రచారం చేస్తున్న తెలుగు తమ్ములపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అక్కడ చేస్తున్నది సహాయం కాదని.. అదంతా ప్రచారం కోసం చేస్తున్నదని చెబుతున్నారు.దీంతో సామాన్య నెటిజన్లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు.చంద్రబాబు చేస్తున్నది నిజమైన పని అని..ఆ వయసులో కూడా 24 గంటల పాటు వరద బాధితుల కోసం ఆలోచిస్తున్న చంద్రబాబు విషయంలో చేస్తున్న ప్రచారం తగదని తప్పుపడుతున్నారు.
* అహోరాత్రులు శ్రమిస్తున్న చంద్రబాబు
చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులో బస చేస్తున్నారు. రోజు మొత్తంలో ఆయన నిద్రపోతున్నది కేవలం నాలుగు గంటలు మాత్రమే. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులతో సమీక్షలు జరిపారు.మిగతా జిల్లాల అధికారులతో మాట్లాడి వరద సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత బాధితుల పరామర్శకు వెళ్లారు. మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చారు. మళ్లీ సమీక్షలు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ బాధితుల పరామర్శకు బయలుదేరారు. ఉదయం నాలుగు గంటల వరకు అక్కడే గడిపి.. తిరిగి విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. బస్సులో సేదదీరారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద బాధితుల పరామర్శలు, సమీక్షల్లోనే గడిపారు.
* ఎన్నడూ చూడని విపత్తు
అయితే గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విపత్తు ఇది. 174 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కృష్ణా నదిలో ఎన్నడూ లేనంత నీటి ప్రవాహం పెరిగింది. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. విజయవాడ నగరం మునకకు కారణమయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి నుంచి చంద్రబాబు సమీక్షలు జరపవచ్చు. ఏరియల్ సర్వేలతో సరిపెట్టవచ్చు.కానీ చంద్రబాబు అలా చేయలేదు. నేరుగా రంగంలోకి దిగారు.బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఉంటేనే అధికారులు ఉరుకులు పరుగులు పెడతారని భావించారు. అందుకే కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస చేశారు. అది ప్రచార యావ కాదు. కానీ వైసీపీ మాత్రం ప్రచార ఆర్భాటంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
* హర్షించని ప్రజలు
ఏది నిజమో? ఏది అబద్దమో? ఇట్టే తెలిసిపోయిన రోజులు ఇవి.కానీ చంద్రబాబు అహోరాత్రులు శ్రమపడి విజయవాడ నగరం యధాస్థితికి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకటి మాత్రం నిజం. భారీ వర్షాలకు లక్షలాదిమంది బాధితులు నిరాశ్రయులు అయ్యారు. దాదాపు లోతట్టు ప్రాంతాల్లో వేలాది ఇల్లు ముంపు బారిన ఉన్నాయి.అక్కడ ముంపును తొలగించడం అంత ఈజీ కాదు. సహాయ చర్యలు కూడా అంత సులువు కాదు. అందుకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రంగంలోకి దిగారు. చిత్తశుద్ధితో కృషి చేశారు. కానీ వైసీపీ మాత్రం రాజకీయం చేయడం ప్రారంభించింది. ప్రచార ఆర్భాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. కానీ వారి ప్రయత్నాలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన మాత్రం రావడం లేదు.