ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ విధంగా మూడు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అయితే చివరి రోజయిన కనుమ పండుగను రైతులందరూ పశువులకు కృతజ్ఞతగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే కనుమను పశువులకు, వ్యవసాయానికి ప్రతీకగా ఎందుకు జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం..
జనవరి నెలలో రైతులు పండించిన పంటలన్నీ కోతలు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటాయి. ఈ ధాన్యాన్ని పండించడానికి ఆరునెలలపాటు వ్యవసాయంలో తోడుగా తమవంతు సహాయం చేసినందుకు గాను పశువులకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. అందుకోసమే కనుమ రోజు ఉదయం పశువులకు శుభ్రంగా స్నానం చేయించి, పశువుల పాక కడిగి అందంగా ముస్తాబు చేస్తారు. అలాగే పశువులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఎద్దుల కొమ్ములకు ప్రత్యేకంగా అలంకరిస్తారు.
కొత్తగా పండిన ధాన్యంతో చక్కెర పొంగలిని చేసి ఆ పొంగలిని పశువులకు నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా పండుగ రోజు కొత్త ధాన్యాలతో మనం తయారు చేసుకున్న పిండివంటలను కూడా పశువులకు పెడతారు. పంట పండించడంలో రైతులకు సహాయంగా ఉంటూ మన కుటుంబం సంతోషంగా గడపడానికి పశువులు కూడా తమ వంతు సహాయం చేస్తాయి కాబట్టి ఈ పండుగను వ్యవసాయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ కనుమ రోజు చాలా గ్రామాలలో ఎడ్ల బండి పందేలు కూడా నిర్వహిస్తారు. అలాగే కొన్ని గ్రామాలలో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించడం ఈ సంక్రాంతి ప్రత్యేకత అని చెప్పవచ్చు.