YCP: సాధారణంగా ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల ప్రకటనలు బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు. గత ఎన్నికల్లో అధికార టిడిపి నిస్సహాయత వ్యక్తం చేసింది. చాలాచోట్ల వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. వైసిపి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ అదే తరహా ప్రకటనలు చేస్తోంది. టిడిపి పెద్ద ఎత్తున రిగ్గింగులకు పాల్పడిందని ఆరోపిస్తోంది. దీంతో గత ఎన్నికల్లో టిడిపికి ఎదురైన పరిస్థితి.. వైసీపీకి ఎదురు కానుందని అంచనాలు ప్రారంభమయ్యాయి. ఓటమి సాకుల కోసమే వైసిపి ఈ తరహా ఆరోపణలు చేస్తోందని.. విపక్షాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో వైసిపి ఆత్మరక్షణలో పడిపోతోంది. ఒకవైపు లెక్కింపు వరకు సొంత పార్టీ శ్రేణులకు, అటు అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. విజయం వైసీపీ దేనని నమ్మించే ప్రయత్నం చేసింది.
మరోవైపు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.ఒకవేళ వైసీపీ ఓడిపోతే ప్రజలకు విశ్వాసం లేదన్న ప్రచారాన్ని.. మొదలు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా సిద్ధంగా ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్ వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల కామెంట్స్ పెట్టారన్న వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పథకాలు తీసుకునేవారు విశ్వాసం చూపించడానికి సమయం ఆసన్నమైందని.. అందరూ ఆశీర్వదించి ఓటు వేయాలని కోరినట్లు టాక్ నడిచింది. ప్రభుత్వ పథకాలు తీసుకున్నవారు కృతజ్ఞతతో తలవంచి ఓటు వేస్తారని.. కృతజ్ఞత లేని వారు విపక్షాలకు ఓటు వేస్తారని సాక్షాత్ వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఓటమి ఎదురైతే.. ప్రజల్లో విశ్వాసం లేదు అన్న మాటను బలంగా పంపించాలని వైసీపీ భావిస్తోంది. తద్వారా కొంతవరకైనా సింపతి దక్కించుకొని.. పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం గా తెలుస్తోంది. ఇంతటి వ్యతిరేకతలో, టైట్ ఫైట్ లో.. గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సాక్షాత్ సీఎం జగన్ ప్రకటించడం ఎత్తుగడలో భాగమేనని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓటమి ఎదురైతే దానికి ప్రజలను బాధ్యులు చేస్తూ.. సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. గత ఎన్నికల్లో అంతులేని విజయం దక్కేసరికి ప్రజలపై విశ్వాసం ఉంచిన వారు.. ఓటమి ఎదురైతే మాత్రం విశ్వాసం లేని ప్రజలుగా అభివర్ణించడం కొంచెం అతి అవుతుంది.