Vijayasai Reddy Latest News: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణుల ఆశలపై నీళ్లు పోశారు విజయసాయిరెడ్డి. 2029 ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని వైసిపి భావిస్తోంది. అంత సీన్ లేదని గాలి తీసేశారు విజయసాయిరెడ్డి. ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారని తేల్చి చెప్పేశారు. ఒక విధంగా ఇది వైసిపి ఆశలపై నీళ్లు పోయడమే. గత కొద్ది రోజులుగా గట్టిగానే సౌండ్ చేస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా పోరాటాలు కంటే సోషల్ మీడియా వేదికగా ఇక అధికారం తమదే అన్నట్టు వ్యవహరిస్తోంది. సరిగ్గా అటువంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. కోటరీ అనే పాత మాట చెబుతూనే.. కూటమి ఉన్నంతవరకు జగన్ అధికారంలోకి రారని చెప్పడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను మిగిల్చారు. ఎందుకంటే విజయసాయిరెడ్డిని తమ పార్టీ నేతగానే ఇప్పటికీ చూస్తారు వైసిపి శ్రేణులు. అటువంటి విజయసాయిరెడ్డి చెప్పేసరికి వారిలో ఒక రకమైన అనుమానాలు ప్రారంభం అయ్యాయి.
సరిగ్గా ఏడాది కిందట..
సరిగ్గా ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). వైసీపీ నుంచి వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి రాజకీయాల గురించి మాట్లాడనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. మరి ఈ ఏడాదిలో ఆయనకు వ్యవసాయం గిట్టుబాటు కాలేదో ఏమో కానీ.. మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెబుతున్నారు. ఎలాగూ కూటమి పార్టీలు చేర్చుకోవు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు. అక్కడ ఆయనకు ఎవరో ఫుల్ స్టాప్ పెడుతున్నారు. అందుకే ప్రెస్టేషన్లో వైసిపి పై శకునాలు మాట్లాడుతున్నారు. కూటమి ఉన్నంతవరకు నో నెవర్.. అన్నట్టు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన తెచ్చి పెడుతున్నాయి.
వైసీపీయే టార్గెట్
అయితే విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుంటేనే ఆయన నుంచి ఇబ్బందులు ఉండవు. ఆయన పొలిటికల్ జంక్షన్ లో( political Junction) నిలబడిన టార్గెట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. బిజెపిలో చేరితే కూటమిని విడగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ఎందుకంటే 2018లో విజయసాయిరెడ్డి మూలంగానే ఢిల్లీ పరిణామాలు మారాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గుడ్ బై చెప్పింది. ఈ ఎనిమిదేళ్లలో అనేక రకాల గుణపాఠాలు నేర్చుకుంది. అందుకే విజయసాయి రెడ్డికి ఈసారి ఆ అవకాశం ఇవ్వదు. ఇప్పటికే బిజెపిలో టిడిపి మనుషులు ఉన్నారు. చంద్రబాబు మనసు ఎరిగి బిజెపి నేతలు ప్రవర్తిస్తున్నారు. సో విజయసాయి రెడ్డికి అక్కడ ఛాన్స్ లేదు. వైసీపీ రాణించడం లేదు. విజయసాయి రెడ్డి బయట ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.