Peddireddy summoned for ED questioning: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నిన్ననే విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈరోజు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విచారణకు వచ్చారు. నిర్దేశించిన సమయానికి ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. తొలుత ఏపీ సిఐడి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు విచారణ చేపడుతోంది. అయితే పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందన్న ఆరోపణలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈరోజు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అరెస్టు ఉంటుందా? అన్న అనుమానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే ఏపీ బీజేపీ నేతలు సంచలనాలు నమోదు అవుతాయని చెబుతూ వస్తున్నారు. అందుకే వారిలో ఉత్కంఠ పెరుగుతోంది.
ఆర్థిక వ్యవహారాలన్నీ..
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి ( Raj Kasi Reddy )అయితే.. మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో కూడా ఇదే విషయం తేలినట్లు తెలుస్తోంది. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఎక్కువ రోజులు ఉండిపోయారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. మద్యం తయారీదారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారని.. పెద్ద మొత్తంలోనే ఈ అవినీతి జరిగిందని.. మిగతా వారి కంటే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పాత్ర అధికమని దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం ఈడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని పిలిచిన నేపథ్యంలో ఆయన అరెస్టు ఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. అందుకే అరెస్టు ఉండదని టాక్ నడుస్తోంది.
బిజెపి చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో..
అయితే ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్( BJP Chief Madhav ) సంచలన కామెంట్స్ చేశారు. వైసిపి హయాంలో భారీ అవినీతి జరిగిందని.. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. త్వరలో ఒక సంచలనం నమోదు కానుంది అని కూడా తేల్చి చెప్పారు. ఈ దరిమిలా వైసీపీలో కీలక నాయకుడిగా భావిస్తున్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి ఈడి నుంచి పిలుపు వచ్చింది. అది కూడా విజయసాయిరెడ్డి విచారణ తర్వాత కావడంతో.. అందరిలోనూ ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈడి అంత వేగంగా అరెస్టు చేయదని.. విచారణలో భాగంగానే పిలిచి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.