Chandrababu Naidu Latest News: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) బృందం దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లిన చంద్రబాబు బృందానికి ఘనస్వాగతం లభించింది. ఆ బృందంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే కేవలం అక్కడ పెట్టుబడుల వేట కాదు.. అక్కడ స్థిరపడిన తెలుగు వారితో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాసాంధ్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందుగా స్విట్జర్లాండ్ లోని భారత రాయబారితో సమావేశం అయిన చంద్రబాబు.. పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలతో చర్చలు దిగ్విజయంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఒకవైపు పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూనే.. అక్కడ తెలుగు ప్రముఖులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు.
ఏపీ అనుకూలతలపై వివరణ..
ఏపీలో ( Andhra Pradesh)పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న మార్గాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి వస్తే ప్రభుత్వపరంగా కల్పించే రాయితీలు, జన్మభూమికి సేవ చేసే అవకాశాలు వంటి వాటి గురించి వివరిస్తున్నారు. వారిలో చైతన్యం పెంచుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చెప్పిన భావోద్వేగ మాటలు వారిని ఆలోచింపజేస్తున్నాయి. ఆరోజు తాను ముందు చూపుతో వ్యవహరించడం వల్లే 195 దేశాల్లో ఈరోజు తెలుగు ప్రజలు ఉండగలుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తాను ఆరోజు సాఫ్ట్వేర్ రంగాన్ని, ఐటీ రంగానికి ప్రోత్సహించినందువల్లే ఆ రంగంలో ఉద్యోగం తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు పొందిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అటువంటి వారంతా ఇప్పుడు ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
మరో రెండు రోజులు..
ఈనెల 22 వరకు దావోస్ పర్యటనలో ఉండనుంది సీఎం చంద్రబాబు బృందం. అయితే ఒప్పందాలు మాత్రమే కాదు.. నేరుగా ఏపీలో పెట్టుబడులు పెట్టే వీలుగా వారితో సానుకూల చర్చలు జరుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మరియు వారి బృందం. గత ఏడాది జరిగిన పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ నుంచి ప్రత్యేక బృందం వెళ్ళింది. అప్పట్లో కూడా భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో.. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలిగారు. ఈ ఏడాది కూడా భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రణాళికతో వెళ్లారు. మరి ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తాయో చూడాలి. కానీ చంద్రబాబు మాత్రం గట్టి ప్రయత్నం తోనే అడుగుపెట్టినట్లు అర్థమవుతోంది.
ఈరోజు 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం నేనే – చంద్రబాబు నాయుడు pic.twitter.com/NBfaX7tZQK
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2026
