YSRCP in Social Media: ఇటీవల సోషల్ మీడియాలో( social media) ఒక పోల్ ఎక్కువగా కనిపిస్తోంది. 2029లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది అపోల్ లో అడుగుతున్నారు. అయితే ఎవరికి వారే తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కూటమి పార్టీ సానుభూతిపరులు అయితే ఒకలా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మరోలా స్పందిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ధీమాతో ఉన్నారు. అతి ధీమాతో కూడా ఉన్నవారు ఉన్నారు. ఇక కూటమి పని అయిపోయిందని.. ఇక వచ్చేది తామేనంటూ.. రఫ్ఫా రఫ్ఫా అనే డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఇక సంక్రాంతి సంబరాల్లో అయితే 2029లో జగన్ సీఎం అంటూ పాటలు కూడా వేసి కూడా వినిపించారు. అయితే అది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అంటున్న మాట అంటే లేదంటున్నారు. తామే ప్రత్యామ్నాయం కదా అని జవాబు ఇస్తున్నారు.
ఇవన్నీ చేస్తుంటే..
కూటమి ( alliance) అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ప్రభుత్వం ప్లస్లు మైనస్లు పరిగణలోకి తీసుకుందాం. తొలి ఆరు నెలలు పాలనలో వైఫల్యాలను అధిగమించి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. సరిగ్గా ఏడాది దాటేసరికి అన్ని రకాల సంక్షేమ పథకాలను టచ్ చేసారు. తల్లికి వందనం అమలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేశారు. అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో ఇచ్చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. అన్నింటికంటే ముందు అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందజేశారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు.. విశాఖకు ఐటి పరిశ్రమలను తెస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఆపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటు అవుతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కూటమి సానుకూలతలు.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
అయితే ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు ఎప్పటికప్పుడు వారిని నియంత్రిస్తూ వస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం రాజకీయంగా కూటమికి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి స్పందిస్తున్నారు. బిజెపి పరంగా కేంద్రం నుంచి సాయం అందుతోంది. అయితే రాజకీయ పార్టీలు అన్నాక.. ప్రభుత్వం అన్నాక కొన్ని రకాల వైఫల్యాలు, ఇబ్బందులు రావడం సహజం. ఆపై 165 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగత, సామాజిక, అవినీతి ప్రోత్సాహం వంటి విషయంలో ఆరోపణలు, విమర్శలు రావడం సాధారణం. అయితే ఇంకా దాదాపు 40 నెలల పదవీకాలం ఉంది. దానిని సరిదిద్దుకునే ఛాన్స్ కూడా వారికి ఉంది. అయితే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కాబట్టి.. తాము అధికారంలోకి వచ్చేస్తామని వైసిపి నేతలు భావించడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. 2024 ఎన్నికల్లో కూడా అలానే ఆలోచన చేసి.. దారుణ ఓటమి మూటగట్టుకున్నారు వైసిపి నేతలు. ఇప్పుడు కూడా అలానే అతి చేస్తే ఆ పార్టీకే నష్టం.
ఇంకా జనంలోకి రాకముందే..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జనంలోకి రాలేదు. జనం సమస్యలపై పోరాటం ప్రారంభించలేదు. వైసీపీ నేతలు నియోజకవర్గంలో తిరగడం లేదు. ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నారు. దూకుడు కలిగిన నేతలంతా మౌనం దాల్చారు. సగానికి సగం నియోజకవర్గాల్లో వైసిపి కార్యకలాపాలు జరగడం లేదు. అయినా సరే వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది. 2014లో టిడిపికి ఛాన్స్ ఇచ్చారు. 2019లో వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ లెక్కన 2024 లో ఇస్తే 2029లో ఇవ్వరా? అనేది వైసిపి నేతల వాదన. 1994లో కూడా టిడిపికి ఛాన్స్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు. 1999లో చంద్రబాబు నాయకత్వానికి రెండోసారి జై కొట్టారు. అయితే ఈ సెంటిమెంట్ కంటే.. ప్రజల ఆసక్తి, ఈ రాష్ట్ర అవసరాలు అన్నది గమనిస్తారు. అందుకే వైసిపి నేల విడిచి సాము చేస్తే ఆ పార్టీకి నష్టం. సోషల్ మీడియాలో 2029లో గెలుపు ఎవరిది అనే పోల్స్ పెడితే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. క్షేత్రస్థాయిలో కష్టపడి ప్రజల్లోకి వెళితేనే వైసీపీకి గుర్తింపు. ఆ విషయాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి నేతల వరకు గమనించాల్సిందే.
