Tadepalli: వరకట్నం మహాపాపం.. కట్నం తీసుకోవడం మహా ఘోరం.. కట్నం తీసుకునేవాడు గాడిద.. ఇలా ఎన్ని రకాలుగా సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కొంతమంది మగవాళ్ళు మారడం లేదు. పైగా కట్నం తీసుకోవడం జన్మ హక్కు లాగా భావిస్తున్నారు. వరకట్నాన్ని స్టేటస్ సింబల్ లాగా చెప్పుకుంటున్నారు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా స్థాయికి నుంచి కట్నాలు ఇస్తూ అప్పుల పాలవుతున్నారు. పెద్దలు కుదిరించిన వివాహాలలోనే కాదు.. చివరికి ప్రేమ వివాహాలలో కూడా వరకట్నం ఉండడం విశేషం.
ఏపీలో ఐఏఎస్ అధికారిగా చిన్న రాముడు పనిచేస్తున్నారు. ఈయన కుమార్తె మాధురి సాహితీ బాయి(27) సరిగా మూడు నెలల క్రితం నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. రాజేష్, సాహితి బాయి కులాలు వేరు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సాహితి పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు. రాజేష్ ను వివాహం చేసుకున్న తర్వాత సాహితి అత్తింటి వారి వద్ద ఉంటోంది.
వివాహం జరిగిన నాటి నుంచి రాజేష్ సాహితిపై వేధింపులకు పాల్పడేవాడు. వరకట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఇదే విషయాన్ని సాహితీ తల్లిదండ్రులకు తెలియజేస్తే.. ఆమెను అక్కడి నుంచి పోలీసుల సహకారంతో రెండు నెలల క్రితం తాడేపల్లిలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అప్పటినుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. సాహితీ తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం కోసం..
సాహితీ ఆత్మహత్య విషయంలో చిన్న రాముడు సంచలన విషయాలను వెల్లడించారు.. ” ఉద్యోగం ఉందని మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి నిండా మంచాడు. మహానంది ప్రాంతంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేస్తామని చెప్పి.. అతడి వెంట మా కుమార్తెను పంపించాం. ఆమెను కట్నం కోసం రాజేష్ వేధించాడు. ఇబ్బందులకు గురి చేశాడు. నిత్యం చంపేస్తానని బెదిరించేవాడు. చివరికి మాకు ఫోన్ చేయాలన్నా కూడా తన అనుమతి తీసుకోవాలని బెదిరించేవాడు. ఒకరోజు మా కుమార్తె అతడు బయటికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసింది. ఇక్కడ ఉండలేనని చెప్పింది. దీంతో పోలీసుల సహకారంతో మా కుమార్తెను ఇంటికి తీసుకొచ్చాం. తన భర్త అసలు స్వరూపం తెలిసి కలత చెందుతూ ఉండేది. చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడి మాకు కన్నీటిని మిగిల్చిందని” చిన్న రాముడు మీడియాతో పేర్కొన్నారు.