Kohli And Rohit Sharma Vs Gautam Gambhir: ఇటీవల దక్షిణాఫ్రికా రాంచి వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చాడు. ఆ సమయంలో అతడిని గౌతమ్ అభినందించినట్టు వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి వచ్చిన తర్వాత గౌతమ్ భుజం తట్టి శభాష్ అంటూ అభినందించాడు.. ఈ దృశ్యాలు ఆదివారం నుంచి సోమవారం వరకూ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంతో చాలామంది రోహిత్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తగ్గినట్టేనని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. వారి మధ్య విభేదాలు అలానే ఉన్నాయని తాజా సంకేతాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి జట్టులో స్టార్ ఆటగాళ్ల మధ్య సయోధ్య సరిగ్గా లేనప్పుడు విజయాలు అంత ఈజీగా దక్కవు. భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు లేకపోయినప్పటికీ.. రోహిత్, విరాట్, గౌతమ్ గంభీర్ మధ్య అంతగా గొప్ప బంధాలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే బీసీసీఐ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
2027లో జరిగే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ కోహ్లీ ఆడాలని భావిస్తున్నారు. అలాంటప్పుడు వీరికి, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న అంతరం తగ్గాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందువల్లే సయోధ్య సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా క్రికెట్లో రోహిత్, విరాట్ ప్రాధాన్యం తగ్గించడానికి గౌతమ్ గంభీర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా, అంతకుముందు న్యూజిలాండ్ తో ఎదురైన ఓటములకు రోహిత్, విరాట్ కోహ్లీ లను బాధ్యులను చేసి.. పొమ్మన లేక పొగ పెట్టాడని గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గౌతమ్ గంభీర్ వల్లే విరాట్, రోహిత్ రోజుల వ్యవధిలో టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మను వన్డే ఫార్మాట్ నుంచి సారధిగా తప్పించిన తర్వాత గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ మీద విమర్శలు మరింత పెరిగాయి. ఇక ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగినట్ట సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ కు గురైంది. దీంతో అభిమానులు ఆగ్రహం మరింత పెరిగింది. అందువల్లే కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగర్కర్ ను తప్పించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. రెండో టెస్టు లో టీమిండియా ఓడిపోయిన తర్వాత.. ఆ మ్యాచ్ కు వేదికైన గుహవాటిలో గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు రావడం విశేషం.
రోహిత్, విరాట్ ఫామ్ లోకి రావడంతో గౌతమ్ గంభీర్ మీద ఒత్తిడి పెరిగిపోయింది.. పైగా రాంచి వన్డే తర్వాత జట్టులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టెస్టులలో వరుస ఓటములు.. 2027 వన్డే వరల్డ్ కప్.. దానికంటే ముందు టి20 వరల్డ్ కప్.. ఇన్ని మేజర్ టోర్నీలు ఉన్న నేపథ్యంలో రోహిత్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు మధ్య సయోధ్య కుదిరించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇవి సఫలీకృతం అవుతాయా? జట్టు ఒకప్పటి మాదిరిగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని అభిమానులు పేర్కొంటున్నారు.