YS Jagan: తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఏపీ వరకు హైడ్రా విధానం విస్తరించకున్నా..తెలంగాణలో మాత్రం పెను దుమారానికి కారణమవుతోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో చెరువులను,ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుస పెట్టి కూల్చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినీ హీరో నాగార్జున కన్వెన్షన్ హాల్ ను కూల్చివేయడంతో హైడ్రా సంచలనంగా మారింది. ఇది రాజకీయ రంగు కూడా పులముకుంది. రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారుతుంది. హైడ్రా ఎఫెక్ట్ ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు కూడా ఆక్రమించి కట్టిందేనని.. త్వరలో హైడ్రా నిర్మాణాలను కూల్చివేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కేటీఆర్ కు చెందినదిగా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ లోనూ ఇరిగేషన్ అధికారులు కొలతలు వేశారు. ఆక్రమణలపై నివేదికలు సిద్ధం చేశారు. మరోవైపు ఏపీకి చెందిన చాలామంది నేతల ఆస్తులు, నిర్మాణాలు తెలంగాణలో ఉన్నాయి. అందులో కొన్నింటిపై చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. వాటిపై హైడ్రా దృష్టి పెట్టిందని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన లోటస్ ఫండ్ తెరపైకి వచ్చింది. అక్కడ ఆక్రమణలపై హైడ్రా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన నోటీసులను జగన్ కు ఇచ్చినట్లు సమాచారం.
* అక్రమమైతే కూల్చివేత
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే వైసీపీ చీఫ్ జగన్ ఇల్లు కూడా వచ్చింది. జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో జగన్ ఇంటిని చెరువును ఆనుకొని నిర్మించారు. దీంతో చెరువును ఆక్రమించి కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే హైడ్రా జగన్ కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణం కావడంతో కూల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక్క జగన్ కే కాదు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం నోటీసులు అందినట్లు సమాచారం. వారి ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
* షర్మిల ఆధీనంలో లోటస్ పాండ్
వాస్తవానికి లోటస్ పాండ్ ప్రస్తుతం షర్మిల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. జగన్ పేరుతో ఉన్న లోటస్ పాండ్ లోకి ఇటీవల ఆయన వెళ్ళింది తక్కువ. ఏపీలో ఓటమి తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో పులివెందుల వెళ్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని సొంత నివాసంలో గడుపుతున్నారు. లోటస్ పాండ్ వైపు మాత్రం చూడడం లేదు. కొద్ది రోజుల కిందటే లోటస్ పాండ్ బయట.. పోలీసుల కోసం నియమించిన చిన్నపాటి భవనాలను ఆక్రమణల పేరిట జిహెచ్ఎంసి తొలగించింది. అప్పుడే వివాదం జరిగింది. కానీ తరువాత సద్దుమణిగింది.
* రేవంత్ తో పడదు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో జగన్ కు అంతగా సంబంధాలు లేవు. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. కనీసం ఆయనకు శుభాకాంక్షలు తెలపలేదు. ఇదే విషయాన్ని రేవంత్ సైతం ప్రస్తావిస్తూ బాధపడ్డారు. మరోవైపు ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు. రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం కూడా నెలకొంది. విభజన హామీల అమలుకు ఇరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు కూడా. అయితే ప్రస్తుతం లోటస్ పాండ్ షర్మిల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. అయితే జగన్ కు నోటీసులు అందడం విశేషం. అయితే నిబంధనలకు విరుద్ధం అయితే హైడ్రా ఈపాటికే కూల్చివేతలను ప్రారంభించేది. అయితే ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.