https://oktelugu.com/

Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు కాలేజీ కథలో కీలక మలుపు.. ఆ వివాదమే కారణమా?

ఓ కాలేజీలో.. బాలికల వాష్ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చారు అన్న వివాదం కుదిపేస్తోంది. అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే. కానీ సోషల్ మీడియాలో మాత్రం కెమెరాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 31, 2024 / 01:57 PM IST

    Gudlavalleru Engineering College

    Follow us on

    Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కథలో కీలక మలుపు. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ బాలికల హాస్టల్ లో వాష్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారు అన్నది ఒక ప్రచారం జరిగింది. దాదాపు 3000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఒక రకమైన భయం కనిపించింది. మరోవైపు గురువారం రాత్రి ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సెల్ ఫోన్ వెలుగులో నిరసన చేపట్టారు. శుక్రవారం వేకువ జాము మూడు గంటల వరకు ఆందోళన కొనసాగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదానికి కారణమైన ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను సముదాయించారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కళాశాల యాజమాన్యం శుక్రవారం సెలవు ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర తోపాటు కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు పోలీస్ ఉన్నత స్థాయి బృందం రంగంలోకి దిగింది. అసలేం జరిగిందనే విషయంపై ఆరా తీస్తోంది. కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

    * కనిపించని కెమెరా ఆనవాళ్లు
    అయితే వాష్ రూమ్లలో ఒక్క కెమెరా కూడా బయట పడలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ప్రచారం నడుస్తోంది. చివరకు వాటర్ షవర్లలో సైతం కెమెరాలు అమర్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే అక్కడ ఎటువంటి ఆనవాళ్లు పోలీసులకు కనిపించలేదని తెలుస్తోంది. మరోవైపు అనుమానితులుగా భావిస్తున్న విద్యార్థులు, విద్యార్థినుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో కనీసం ఎటువంటి క్లూ దొరకలేదని సమాచారం. అయితే ఓ ఇద్దరూ విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీంతో కేసు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.

    * జూనియర్, సీనియర్ల మధ్య సంవాదం
    వాస్తవానికి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య సంవాదమే దీనికి కారణమని సమాచారం. మీ లెక్క తేల్చుతాం. వాష్ రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టామని నోటి దూలతో ఓ సీనియర్ విద్యార్థి వ్యాఖ్యానించడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం. మరోవైపు ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినిల ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదంతోనే.. ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థినిని కాపాడే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ప్రత్యేక వాహనంలో హాస్టల్ నుండి తీసుకెళ్లిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

    * సోషల్ మీడియాలో కనిపించాలి కదా?
    వారం రోజుల కిందట ఈ ఘటన బయటకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వాష్ రూమ్లలో ఏర్పాటుచేసిన సీక్రెట్ కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలు బయటకు వెళ్లిపోయినట్లు కూడా టాక్ నడుస్తోంది. అదే జరిగితే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వెలుగు చూసేది కదా? కానీ అటువంటివి కనిపించడం లేదు. అయితే ఇది కేవలం కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదంగా తెలుస్తోంది. అదే చిలికి చిలికి గాలి వానలా మారి.. పెను వివాదానికి దారి తీసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.