YCP: ఆరు నెలల్లో వైసిపి ఎలా పుంజుకుంటుంది జగన్?

వైసిపి ఆవిర్భావం నుంచి ఒక ఎత్తు.. ఈ ఎన్నికలను నుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. గతంలో వైసీపీ అంటే నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసేవారు. కానీ ఇప్పుడు పార్టీ అంటేనే ముఖం చాటేస్తున్నారు. జగన్ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకొస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 18, 2024 5:44 pm

YCP

Follow us on

YCP: వైసిపి ఆరు నెలల్లో పుంజుకుంటుందా? జగన్ భావిస్తున్నట్టు ఆ పరిస్థితి ఉందా? నేతలంతా తెరపైకి వస్తారా? యాక్టివ్ గా పని చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు. వారికి హితబోధ చేస్తున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో ఇదే విషయంపై మాట్లాడారు జగన్. ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మీదేనంటూ నొక్కి చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని ముందుకు నడిపేందుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించే బాధ్యత కూడా సీనియర్లపై పెట్టారు. అందర్నీ కలుపుకెళ్లాలని కూడా సూచించారు. అయితే జగన్ నిర్వహిస్తున్న వర్క్ షాప్ లకు కీలక నేతలు డుమ్మా కొడుతున్నారు. వచ్చింది అరకొర మాత్రమే. అలా వస్తున్న వారు కూడా పెద్దగా యాక్టివ్ లేని వారే. వారితో పార్టీ ఎలా పుంజుకుంటుందో జగన్ కే తెలియాలి. ఎన్నికలకు ముందు రకరకాల కారణాలు చూపుతూ 80 మంది అభ్యర్థులను మార్చారు. ముందుగా నియోజకవర్గ ఇన్చార్జిలు యాక్టివ్ గా లేరు. వారు లేకుండా పార్టీ శ్రేణులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం ఆరు మాసాల గడువు ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నియామకం పూర్తి చేశారు. కానీ నియోజకవర్గ ఇన్చార్జిలు మాత్రం ఇంతవరకు యాక్టివ్ కాలేదు. ఆ విషయాన్ని మాత్రం జగన్ పట్టించుకోవడం లేదు.

* పార్టీని వీడుతున్న నేతలు
పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. వారి స్థానంలో ఆ నియోజకవర్గంలో సంబంధం లేని వారిని నియమిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన తప్పిదాన్నే మళ్లీ పునరావృతం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు గెలుపు గుర్రాలంటూ 80 మంది అభ్యర్థులను మార్చారు. ఈ నియోజకవర్గ నాయకుడిని వేరే నియోజకవర్గానికి మార్చారు. అయినా సరే ప్రజలు తిరస్కరించారు.అయితే ఇలా పోటీ చేసిన వారే నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. కానీ వారు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిరగడం లేదు. ఇటువంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరు పోరాటం చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.

* నాయకులు తలోదారి
రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సీనియర్లు సైలెంట్ గా ఉన్నారు. అస్సలు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. వారు పార్టీలో తిరిగి యాక్టివ్ అవుతారో లేదో తెలియదు. ఇక మంత్రులుగా పనిచేసిన వారి గురించి చెప్పనవసరం లేదు. ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేత పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. ఎన్నికలకు ముందు సీఎం హోదాలో జగన్ ఉండగా.. పక్కనే కూర్చుని మరి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థులను ప్రకటించారు. అటువంటి నేత ఇప్పుడు జగన్ వద్దకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఆయనతోపాటు చాలామంది సీనియర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. వైసిపి హయాంలో పదవులు అనుభవించిన వారు సైతం ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో ఉన్న నేతలు ముఖం చూపించడం లేదు. పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న వారు గుడ్ బై చెబుతున్నారు. జూనియర్ లు తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆరు నెలల్లో వైసిపి పుంజుకోవడం సాధ్యమేనా? అనే ప్రశ్న వినిపిస్తోంది.