CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం తన నెల రోజుల పాలనను పూర్తి చేసింది. 30 రోజుల పాలన పూర్తయింది. జూన్ 4న ఫలితాలు రాగా.. కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. అదే నెల 12న కొలువుదీరింది. ప్రధాని మోదీ సమక్షంలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైన 5 పైళ్లపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. పోలవరం తో పాటు అమరావతిని సందర్శించి తన ప్రాధాన్యతను తెలియజేశారు. ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అమరావతి రాజధాని తో పాటు రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల గురించి విన్నవించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి 30 రోజులపాటు క్షణం తీరిక లేకుండా గడిపారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు కూడా తమ శాఖల పనితీరును తెలుసుకున్నారు. సమగ్ర స్టడీ చేసి అవగాహన పెంచుకున్నారు.
టిడిపి కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఈరోజుకు నెలరోజులవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం తో పాటు అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావలసిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేత పత్రాల విడుదల కూడా వరుసగా జరుగుతోంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. కానీ వాటి అమలు విషయంలో అదే దూకుడు ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.
ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ప్రకటించారు చంద్రబాబు. అందుకే అధికారంలోకి వచ్చిన మరుక్షణం కీలకమైన ఐదు అంశాలకు సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేశారు. తరువాత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు వీలుగా సంతకాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మరోవైపు పెన్షన్ల పెంపు అంశం పూర్తయింది. జూలై 1న విజయవంతంగా పంపిణీ చేయగలిగారు. నైపుణ్య గణన అనేది చేపట్టాల్సి ఉంది.
ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ప్రతి ఇంట్లో మహిళకు 1500 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కూడా మార్గదర్శకాలు రావాల్సి ఉంది. తల్లికి వందనం పేరిట కసరత్తు జరుగుతుంది. ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. అయితే రవాణా చార్జీల విషయంలో కొద్దిపాటి అనుమానాలు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, పాలన వైఫల్యాలపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు. తద్వారా ప్రజల్లో ఒక రకమైన సంకేతాలు పంపగలుగుతున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కోటరీ అధికారులకు చెక్ చెప్పారు. వారిపై బదిలీ వేటు వేశారు. అన్నింటికంటే కీలకమైన విభజన సమస్యలపై దృష్టి సారించారు చంద్రబాబు. హైదరాబాదులోని ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కీలక చర్చలు జరిపారు. అంతకుముందు ఢిల్లీ వెళ్లి ఏపీని ఆదుకోవాలని కోరారు. లక్ష కోట్లు కావాలని ప్రతిపాదనలు పెట్టారు. అటు డిప్యూటీ సీఎం పవన్, ఇతర మంత్రుల సైతం తమ శాఖల పనితీరుపై పడ్డారు. వరుసగా సమీక్షలు చేసి పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే నెలరోజుల పాలనను సీఎం చంద్రబాబు తో పాటు మంత్రివర్గ సహచరులు విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారికి ఉన్నది 59 నెలలు మాత్రమే. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: How is chandrababu rule for 30 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com