Muttiah Muralitharan: ముత్తయ్య మురళీధరన్ సెకండ్ ఇన్నింగ్స్.. వామ్మో అన్ని కోట్లా?

శ్రీలంకలో పేద కుటుంబానికి చెందిన ముత్తయ్య మురళీధరన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. పేరుపొందిన స్పిన్నర్ గా అవతరించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 9:39 am

Muttiah Muralitharan

Follow us on

Muttiah Muralitharan: ముత్తయ్య మురళీధరన్.. ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మెలికలు తిప్పే బంతులు వేస్తూ, రెప్పపాటులో వికెట్లు పడగొడతాడు. చూస్తుండగానే చేయాల్సిన విధ్వంసం మొత్తం చేసేసి వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వే దాకా.. అతని బాధిత క్రికెట్ జట్టు లేదంటే ఆశ్చర్యం అనిపించక మానదు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడిన ముత్తయ్య మురళీధరన్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన అనంతరం.. ఇప్పుడు సరికొత్తగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు.

శ్రీలంకలో పేద కుటుంబానికి చెందిన ముత్తయ్య మురళీధరన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. పేరుపొందిన స్పిన్నర్ గా అవతరించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.. ఇప్పట్లో ఇతర రికార్డు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం.. అయితే మురళీధరన్ కు భారతదేశంతో సన్నిహిత సంబంధాలున్నాయి. చెన్నై ప్రాంతంలో ఇతడికి బంధువులు కూడా ఉన్నారు. అందువల్లే అతడి సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మాతృదేశంలో కాకుండా, భారత్ లో వ్యాపారాన్ని మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలోని చామరాజ నగర్ జిల్లా బదన గుప్పె ప్రాంతంలో ₹1,400 కోట్ల వ్యయంతో పానీయాలు, మిఠాయిల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మురళీధరన్ ముందుకు వచ్చాడు.. ఈ మేరకు కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తో చర్చలు జరిపాడు.. ప్రభుత్వం నుంచి అందించే సహకారం, భూమి కేటాయింపునకు సంబంధించి కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ముత్తయ్య బ్రాండ్ పేరు మీద పానీయాలు, మిఠాయిలు తయారుచేసి విక్రయిస్తారని సమాచారం.. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట ₹230 కోట్ల పెట్టుబడితో ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత సవరించిన అంచనా ప్రకారం ₹1,400 కోట్లకు. ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముత్తయ్య మురళీధరన్ ప్రకటించారు. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం 46 ఎకరాల భూమి కేటాయించింది. 2025 జనవరి నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా కార్యకలాపాలు మొదలవుతాయని ముత్తయ్య మురళీధరన్, ఎంబీ పాటిల్ ప్రకటించారు..