Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కాలం కలిసి రావడం లేదు. పార్టీ పెట్టి సుదీర్ఘకాలం అవుతున్నా..అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించడం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో కూటమి కట్టి గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా తనకు లభించిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ప్రచార పర్వంలో అడుగుపెట్టారు. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచే శ్రీకారం చుట్టారు. కానీ అనారోగ్య సమస్యలతో ప్రచారానికి ఇబ్బంది కలుగుతోంది. పిఠాపురంలో ప్రచారం ప్రారంభించిన రోజే జ్వరం బారిన పడ్డారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రచారం ప్రారంభించారు. కానీ జ్వరం వదలక పోవడంతో మరో రెండు రోజులపాటు ప్రచారానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. వరుసగా కలుగుతున్న ఇబ్బందులతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. భాగస్వామ్య పార్టీలు సైతం నిరాశ పడుతున్నాయి.
టిడిపి, జనసేన,బిజెపి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. తమ తరపున పవన్ ప్రచారం చేయాలని ఆ మూడు పార్టీల అభ్యర్థులు కోరుకుంటున్నారు. పవన్ తమ తరపున ప్రచారం చేస్తే హైప్ వస్తుందని.. గెలుపు సునాయాసం అవుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగిన జనసేన అభ్యర్థుల సైతం పవన్ పై నమ్మకం పెట్టుకున్నారు. పవన్ ను చూసి ప్రజలు తమకు ఓటేస్తారని భావిస్తున్నారు. పవన్ ఒకసారి తమ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తే చాలు అన్న రీతిలో ఉన్నారు. కానీ ఆదిలోనే పవన్ ప్రచారానికి అనారోగ్య సమస్యలు వెంటాడడం వారిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ అంటే వాయిదాల వీరుడు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఆయన చెప్పింది చేయడు అన్నంత రీతిలో ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితి ఉండడంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది.
ఇంకా ఎన్నికల ప్రచారానికి కేవలం 40 రోజులే మిగిలి ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. మే 11 వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ఒకవైపు జగన్ బస్సు యాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ విషయంలో అలా జరగడం లేదు. దీనిపై జనసైనికులు కూడా బాధపడుతున్నారు. ఆలస్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పవన్. తొలిరోజే జ్వరం బారిన పడ్డారు. దీంతో పవన్ ఇంత సుకుమారమా అని వైసిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ప్రజాక్షేత్రంలో తిరగాలంటే స్టామినా కావాలంటూ ఎద్దేవా చేస్తోంది. ఇది జనసేనకు ఇబ్బందికర అంశంగా మారింది. పవన్ కార్యక్రమాలేవి అనుకున్న రోజుకు ప్రారంభం కావు. ఎన్నికల ప్రచారం విషయంలో కూడా ఇలానే జరిగింది. తొలుత ఒక షెడ్యూల్ విడుదల చేశారు. దానిని మార్పు చేసి మరోసారి ప్రకటించారు.
మిగతా పార్టీల అధినేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సైతం తన వయసును లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఏడుపదుల వయసులో కూడా రోజుకు మూడు అసెంబ్లీ స్థానాల్లో రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు జగన్ సైతం రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలో చరిష్మ గల నేతగా పవన్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఒకవైపు కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు. మరోవైపు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా అయితే కష్టమేనని సగటు జనసైనికుడే అభిప్రాయపడుతున్నాడు. అటు మిగతా భాగస్వామ్య పార్టీల్లో సైతం పవన్ వ్యవహార శైలి పై ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఉన్నది తక్కువకాలం కావడంతో పవన్ యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. మరి పవన్ దూకుడు పెంచుతారో? లేదో? చూడాలి.