YSR Congress MLCs: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో హై డ్రామా చోటు చేసుకుంది. ఏడాది కిందట ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. కూటమి పార్టీల్లో చేరారు. రాజీనామాలు ఆమోదానికి నోచుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు పిలిచారు శాసనమండలి చైర్మన్. అయితే ఆ ఆరుగురిలో ఒకరు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకున్నారు. మిగతా ఐదుగురు మాత్రం తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని తేల్చి చెప్పారు. మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఇన్నేళ్లపాటు రాజీనామాలను తొక్కి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్. ఎందుకంటే తమ పార్టీకి చెందిన మండలి చైర్మన్ ఉండడంతో తమ మాటను నెగ్గించుకోగలిగింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
* ఆరుగురు రాజీనామా..
2024లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత( Sunita ), కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకట్రమణ, జాకియా ఖానం తదితరులు రాజీనామా చేశారు. ఏడాదికి పైగా వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. ఎందుకంటే వీరి రాజీనామా ఆమోదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం మండలి లో తగ్గిపోతుంది. అందుకే ఆ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోసిన్ రాజు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇందులో జయ మంగళం వెంకట్రమణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నాలుగు వారాల్లో వీటికి పరిష్కార మార్గం చూపించాలని కోరడంతో చైర్మన్ స్పందించారు.
* ఆమె ఉపసంహరణ..
అయితే నిన్నటి విచారణకు జాకియా ఖానం( jhakiya Khanum) హాజరయ్యారు. ఎమ్మెల్సీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే ఇప్పటికే ఆమె బిజెపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న సమయంలో కడప జిల్లా నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆమె మనసు బిజెపి వైపు మళ్ళింది. పురందేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్న సమయంలోనే ఆమె బిజెపిలో చేరారు. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అయితే ఆమె రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. పైగా 2026 జూలైలో ఆమె పదవి విరమణ చేయనున్నారు. అందుకే ఆమె విషయంలో కూటమి మినహాయింపు ఇవ్వడంతో రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. మిగతా ఐదుగురు విషయంలో మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. మొత్తానికి అయితే ఎమ్మెల్సీల రాజీనామా అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది.