YS Jagan Mohan Reddy: నేను ఇలానే ఉంటాను.. నాలానే ఉంటాను.. నాకు తోచిందే చేస్తాను అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. జనాల చేతిలో ఉండే ప్రతిపక్ష హోదా గురించి ఆయన పట్టుబడుతున్నారు. బలం లేదని చెప్పడం లేదు. అందుకు అంగీకరించడం లేదు. అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా సాకు చెప్పి బహిష్కరించారు. సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న శాసనమండలికి మాత్రం హాజరవుతున్నారు. 11 మంది బలమున్న పార్లమెంటుకు సైతం వెళ్తున్నారు. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. అప్పుడే కావాల్సినంత సమయం దొరుకుతుందని.. ఏపీ ప్రజల గురించి ఆలోచన చేస్తానని.. వారి తరుపున వాయిస్ వినిపిస్తానని చెప్పుకొస్తున్నారు. అంటే శాసనసభలో ఒకలా.. శాసనమండలిలో ఇంకోలా.. పార్లమెంటులో మరోలా వ్యవహరిస్తూ తన పైనున్న అభిప్రాయాన్ని బలంగా చాటి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
* నాడు జగన్ చెప్పింది ఇదే కదా?
చంద్రబాబుకు కించపరచాలన్న ఉద్దేశంతో.. తమ దయాదాక్షణ్యాలతో ఆయనకు ప్రతిపక్ష నేత మిగిలిందని నాడు నిండు సభలో చెప్పుకొచ్చారు. 23 మంది టిడిపి సభ్యులు ఉండేవారు. అందులో నలుగురు ఫిరాయించారు వైసీపీలోకి. అంటే సంఖ్యాబలం 19కి పడిపోయింది అప్పట్లో. ఒకరిద్దరిని లాగేస్తే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా పోతుందని నిండు సభలో సీఎం హోదాలో చెప్పారు జగన్. అంటే అసెంబ్లీలో 17 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఉంటుందన్నది జగన్ మాటల్లో అర్థం అవుతుంది. కానీ 11 సీట్లు వచ్చిన తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతుండడం మాత్రం వింత గొలుపుతోంది. గతంలో తన మాటలనే తానే వక్రీకరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
* ఎంపీలు ఎందుకు వెళ్తున్నట్టు..
పార్లమెంటులో ఏపీ వాయిస్ వినిపించాలని ఆశీర్వదించి ఎంపీలను పంపించారు జగన్మోహన్ రెడ్డి. తాను శాసనసభకు వెళ్లకుండా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని కడిగేస్తానని చెబుతున్నారు. ప్రెస్ మీట్ లు అయితే పెడుతున్నారు కానీ అదే ఎంపీలను ఢిల్లీ వరకు పంపించడం ఎందుకు? ఇక్కడే ప్రెస్ మీట్ లు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం కురిపించవచ్చు కదా? ఏపీలోనే ఆయనకు ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉన్నట్టు ఉంది. అది కూడా తెలుగుదేశంతో పాటు జనసేన ఆయనకు ప్రత్యర్థి. ఏపీలో పోటీ చేస్తున్న బిజెపి వ్యతిరేకం కానీ.. కేంద్రంలో ఉన్న అధికార బిజెపి మాత్రం జగన్మోహన్ రెడ్డికి స్నేహపూర్వక పార్టీ. ఇలా చట్టసభల్లో వేరువేరుగా వాయిస్ వినిపిస్తున్న ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి ది. అయితే ఇది నేషనల్ మీడియాకు వింతగా కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ తీరుపై వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోంది. ప్రసారం చేస్తోంది. ఎవరెన్ని అనుకున్నా నేను మారను అన్నట్టు ఉంది జగన్ వైఖరి.
* అందరికీ పని అక్కడ
పార్లమెంటు అయినా.. రాష్ట్ర శాసనసభ అయినా.. శాసనమండలి అయినా.. అవి చట్ట సభలే. ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు అక్కడ వాయిస్ వినిపించాలి. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అక్కడ ప్రతిపక్షానికి పని ఉంటుంది. పాలక పక్షానికి పని ఉంటుంది. ఎవరి పాత్ర వారు పోషిస్తేనే ప్రజలకు మంచి జరిగేది.