CM Jagan: తాను పేదవాడినని సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. బీద అరుపులు అరుస్తుంటారు. కానీ నేలపై అడుగు పెట్టకుండా.. ఆకాశమార్గంలో ప్రయాణిస్తుంటారు. తాజాగా తన ఎన్నికల ప్రచారానికి రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. అయితే నెలకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల అద్దెను ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధపడుతుండడం విశేషం. సీఎం జగన్ భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభలకు ప్రభుత్వ నిధులతో హెలికాప్టర్ల అద్దెపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
సరిగ్గా ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పర్యటనల కోసం ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ సిద్ధం చేస్తోంది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో అందుబాటులో ఉండేలా నిర్ణయించింది. అయితే ఇవి సొంతంగా ఏర్పాటు చేయడం కాకుండా.. అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించడం విశేషం. అయితే ట్విన్ ఇంజన్లు కావడంతో.. ఒక్కో హెలిక్యాప్టర్ అద్దె రూ.1.91 కోట్లుగా నిర్ణయించారు. గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నారు. కేవలం అద్దే కాకుండా అదనంగా ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్, పైలెట్లు, సిబ్బంది, ఇంధన వ్యయం సైతం ప్రభుత్వమే భరించనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అక్షరాల నాలుగు కోట్ల రూపాయలకు పైగా నెలకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం విశేషం.
ప్రస్తుతం సీఎం పర్యటన కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాత బడిందట. సీఎం ప్రయాణానికి అనువుగా లేదట. అందుకే సీఎం పర్యటనతో పాటు వివిఐపి ల టూర్లకు సంబంధించి రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికల అందాయట. ఈ రెండింటిలో ఒకటి విజయ వాడలో, మరొకటి విశాఖలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై విమర్శలు వస్తాయనో.. మరి ఏ ఇతర కారణాలు తెలియదు కానీ.. సీఎం జగన్ భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. సీఎం జగన్ కు జడ్ క్యాటగిరి భద్రత కల్పిస్తున్నందున.. వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలంటూ ఇంటలిజెన్స్ బిజెపి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇంటలిజెన్స్ డిజి, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యధిక రెండు హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట హెలికాప్టర్లను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులు ఇది గుర్తుకు రాలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముమ్మాటికి జగన్ ఎన్నికల ప్రచార సభల కోసమే హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారని.. దీనికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి. భద్రత పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సభలకు ఎలా హాజరవుతారని.. హెలికాప్టర్ల అంటే వైసిపి నాయకత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావడంతో.. రెండు విమానాశ్రయాల్లో హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.