AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మంగళవారం దీనికి ఒక తుది రూపం రానుంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. తాజాగా ఏర్పడే అల్పపీడన ప్రభావంతో కూడా ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. అమరావతి లోని వాతావరణ కేంద్రం కూడా దీనినే స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వాతావరణ శాఖ సైతం కీలక సూచనలు చేసింది.
* ఉత్తరాంధ్ర పై అధిక ప్రభావం..
అల్పపీడన ప్రభావంతో విజయనగరం( Vijayanagaram), విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం సైతం అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.
* మత్స్యకారులకు సూచన..
భారీ వర్ష సూచనల నేపథ్యంలో.. సముద్రం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం( Bay of Bengal ) అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా గుర్లలో 67.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే ఆగస్టులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. ఆ నెలలో సాధారణ వర్షపాతం సగటున 200 మిల్లీమీటర్లుగా నమోదు అయింది. ఇది సాధారణం కంటే 39% అధికం. గత నెలలో అత్యధికంగా సత్య సాయి జిల్లాలో సగటున 143, చిత్తూరులో 123, అనకాపల్లిలో 112, అనంతపురంలో 110, విశాఖలో 100% ఎక్కువ వర్షపాతం నమోదు కావడం విశేషం. సెప్టెంబర్ లో సైతం రికార్డ్ స్థాయిలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.