Wanaparthy: భూమి మీద నూకలు ఉంటే.. చావు చివరి అంచుదాక వెళ్ళినా సరే బతుకుదారు అంటారు పెద్దలు. ఇతడి విషయంలో కూడా అదే జరిగింది. అతడు తన చాతి మీద పొడిపించుకున్న నాయకుడి పచ్చబొట్టు ప్రాణాలు కాపాడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజకీయాభిమానం ఒక్కోసారి ప్రాణాలు కూడా కాపాడుతుందని ఈ సంఘటన నిరూపించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తి పట్టణంలో పీర్ల గుట్ట అనే ఓ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమకారుడు. పైగా ఇతడికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటే ప్రాణం. అతని మీద ఉన్న ఇష్టంతో చాతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని కూడా రాయించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రమేష్.. భారత రాష్ట్ర సమితిలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా రమేష్ హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం వనపర్తి వచ్చారు. పీర్లగుట్ట ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో తమ బంధువులు నివాసం ఉంటుంటే అక్కడికి వెళ్లారు. ఆదివారం వారు టిఫిన్ పెట్టడంతో తిన్నారు. ఆ తర్వాత ఒకసారి ఆస్వాస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కదిలించినప్పటికీ చలనం లేకపోవడంతో చనిపోయారని భావించారు.
రమేష్ చనిపోయాడని కుటుంబ సభ్యులందరూ బంధువులకు సమాచారం అందించారు. అందరూ వచ్చిన తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇదే విషయాన్ని నిరంజన్ రెడ్డికి కూడా చెప్పారు. రమేష్ గురించి నిరంజన్ రెడ్డికి తెలుసు కాబట్టి.. ఆయన అంత్యక్రియలకు హాజరు కావడానికి వచ్చారు. అయితే రమేష్ మృతదేహం పై తన పచ్చబొట్టు ఉండడాన్ని చూసి నిరంజన్ రెడ్డి చలించి పోయారు. అంతేకాదు రమేష్ శ్వాస తీసుకుంటున్నట్టు పచ్చబొట్టు ద్వారా నిరంజన్ రెడ్డికి అనిపించింది. వెంటనే అనుమానం వచ్చి.. రమేష్ మృతదేహం మీద ఉన్న పూలమాలలు మొత్తం తీయించారు. అతని పేరు పెట్టి పిలువగా కనురెప్పలు కదిలించినట్టు కనిపించింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన గంట తర్వాత రమేష్ కళ్ళు తెరిచాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం వనపర్తి నుంచి నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిరంజన్ రెడ్డి తన అంతరంగికులతో చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన తర్వాత రాజకీయాభిమానం కూడా ఒక్కోసారి ప్రాణాలు కాపాడుతుందని నిరూపితమైంది. నిరంజన్ రెడ్డి ఆ సమయానికి రాకపోతే.. రమేష్ చాతి మీద ఉన్న పచ్చబొట్టు చూడకపోతే.. అతడు బతికేవాడు కాదు. బతికి ఉండగానే చితిమంటల్లో కాలేవాడు. అందుకే అంటారు భూమి మీద నూకలు ఉంటే స్మశానం వెళ్ళినా సరే తిరిగి వస్తారని.. రమేష్ విషయంలో అదే నిరూపితమైంది. ఎందుకంటే అతడికి భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి..