Cyclone Effect : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం అంటే అక్టోబర్ 17వ తేదీ తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. గంటకు 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లు.. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో తీవ్ర ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. వాయుగుండం తీరం దాటడంతో ఉత్తర తమిళనాడు, కర్ణాటకతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరద కనిపిస్తుంది. జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ఐటీ కంపెనీల్లోకి వరద నీరు చేరింది.
గురువారం ఏపీలోని పటు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో బుధవారం, వైఎస్ఆర్ జిల్లా, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అనంతపురం, శ్రీసత్యసాయి, బాపట్ల జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు.
మరోవైపు అల్పపీడనం కారణంగా సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. అల్పపీడనం ప్రభావం కారణంగా నెల్లూరు, ప్రకాశం సహా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. నెల్లూరు, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా అధికారులతో సమావేశం అయ్యారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. ముందస్తు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అలాగే ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాలలో ఎపిడెమిక్ సెల్‌లు ఏర్పాటు చేశారు.