Duddikunta Sridhar Reddy : సామాన్యులు బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అంతకు మించి ష్యూరిటీ అడుగుతుంటాయి. బతకడానికి అప్పు చేస్తుంటే.. తాము ఎలా ష్యూరిటీలు తేగలమని సామాన్యులు నిట్టూరుస్తుంటారు. అయితే పెద్దవారికి ఇటువంటి నిబంధనలేవీ వర్తించవు. వేలకు వేల కోట్లు బ్యాంకులకు పంగనామాలు పెట్టి విజయ్ మాల్యా దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన్ను రప్పించేందుకు ప్రభుత్వం ముప్పుతిప్పలు పడుతోంది. దేశ వ్యాప్తంగా విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారు ఎంచక్కా తిరిగేస్తున్నారు. వ్యవస్థల గురించి తెలుసు కనుక.. ఏమీ జరగదని లైట్ తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు దివాలా జాబితాలో చేరారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి దివాలా తీశారు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా రూ.908 కోట్లు బ్యాంకుల వద్ద రుణం చేశారు. ఇప్పుడు తాను రుణం తీర్చలేనని.. అవసరమైతే తన ఆస్తులను విక్రయించుకోవచ్చని చేతులెత్తేశారు. దీంతో బ్యాంకు అధికారులు ఆస్తుల విలువను అంచనా కట్టారు. కానీ రూ.50 వేల కోట్లకు మించి వస్తువులు విలువ చేయవని తేల్చేశారు. దీంతో మిగతా రూ.858 కోట్ల మాటేమిటన్న ప్రశ్నకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుంచి రెస్పాన్స్ లేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆ ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధపడుతున్నారు. దీంతో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే శ్రధర్ రెడ్డి మూలాలు పులివెందులలో ఉన్నాయి. ఆయన సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో ఏదో ఉద్యోగం చేసేవాడు. కానీ తరువాత కాంట్రాక్టర్ గా మారారు. వైసీపీ ఆవిర్భావంతో పొలిటీషియన్ గా అవతారమెత్తారు. 2014 ఎన్నికల్లో హిందూపురం లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో మాత్రం పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అయితే ఆయన కాంట్రాక్టరుగా ఉన్నప్పుడు రూ.900 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి పొందారు. కానీ తిరిగి కట్టడంలో జాప్యం చేస్తూ వచ్చారు. కాలం తీరడంతో రుణాన్ని కట్టలేనని బ్యాంకు అధికారులకు తేల్చేశారు.
అయితే రూ.900 కోట్ల రుణాలకుగాను..రూ.50 కోట్ల ఆస్తులకు వేలం వేయడం ఎమ్మెల్యేకు సంతోషమే. ఇంత పెద్దమొత్తం రుణానికి టోపీ పెడితే సీఐడీ, సీబీఐ ఎంక్వాయిరి నడిచేది. కానీ సీఎం జగన్ కు సన్నిహితుడు కావడంతో బ్యాంకర్లు సైతం లైట్ గా తీసుకుంటున్నారు. విజయ్ మాల్యా భయపడి పారిపోయాడు.. శ్రీధర్ రెడ్డి మాత్రం వ్యవస్థల గురించి బాగా తెలుసుకుని ధైర్యంగా.. అవును డబ్బులు ఎగ్గొట్టా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ తిరుగుతున్నారని.. పుట్టపర్తి ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు. అయితే ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చనీయాంశమవుతోంది.