AP Elections 2024: ఏపీలో అధికార వైసీపీని ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేసుకుందా? అధికారుల బదిలీలు అందులో భాగమేనా? కీలక అధికారులను లూప్ హోల్స్ లో పెట్టడం అందుకేనా? ఇప్పుడు వైసీపీ అభ్యర్థులపై పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఎన్నికల నిర్వహణ. ఇప్పటికే నాలుగో విడత పోలింగ్ ఏపీలో జరగడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అధికారుల బదిలీలు, అధికార వైసిపి అభ్యర్థులపై ఎన్నికల కోడ్ కేసులు నమోదవుతుండడం విశేషం.
కొద్దిరోజుల కిందట చాలామంది అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిన ఒత్తిడితోనే చేసినవన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట ఇంటలిజెన్స్ చీఫ్ తో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు పడింది. ఈ ఇద్దరు వైసీపీకి అనుకూలమైన అధికారులేనన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికి ఎన్నికలతో సంబంధం లేని విధులకు బదిలీ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు డిజిపి పై కూడా వేటు తప్పదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థుల విషయంలో సైతం యంత్రాంగం వాయిస్ మారుతోంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే.. వైసిపి వారికే నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఈసీ ఆదేశాలతో ఆయనపై కేసు నమోదయింది. ఈనెల 13న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి ఆయన ధర్నా చేశారు. దీనిపై టిడిపి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. నివేదిక ఇవ్వాల్సిందిగా గుంటూరు కలెక్టర్ ను ఆదేశించింది. కలెక్టర్ ఇచ్చిన నివేదికతో ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఆయన పై కేసు నమోదు చేయాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే పోలింగ్ సమీపిస్తున్న కొలది ఒకవైపు అధికారులపై వేటు, మరోవైపు వైసీపీ అభ్యర్థులపై కేసులు చూస్తుంటే.. మున్ముందు పరిస్థితులు మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది.