Pawan Kalyan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఎండలతో పాటు రాజకీయాలు సైతం వేడెక్కుతున్నాయి. అటు రాజకీయ పార్టీల సోషల్ మీడియాల మధ్య పొలిటికల్ వార్ నెలకొంది. జూన్ వరకు అది కొనసాగనుంది. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈ తరుణంలో నేతల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం పెద్దపీట వేయడం విశేషం. తాజాగా పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు లేదా సొంత బౌన్సర్లు మాత్రమే పవన్ కు భద్రత కల్పిస్తూ వచ్చారు. కానీ గత రెండు రోజులుగా సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం పవన్ వెంట కనిపిస్తుండడం విశేషం.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ ఎక్కడికి వెళ్లినా జనాలు విపరీతంగా వస్తారు. అందుకే రాష్ట్ర పోలీసులకు ఆయనకు సెక్యూరిటీని కల్పించడం కష్టతరంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇవే నివేదికలు వెళ్లడంతో ఆయనకు.. కేంద్ర భద్రత కల్పించినట్లు సమాచారం. గత ఏడాది విశాఖలో జరిగిన పరిణామాల్లో రాష్ట్ర పోలీస్ శాఖ సరిగ్గా స్పందించలేదని ఒక టాక్ ఉంది. చంద్రబాబు జైల్లో ఉండే సమయంలో పరామర్శకు వచ్చిన పవన్ ను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అప్పట్లో రోడ్డుపై పవన్ బైఠాయించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రిలో సైతం పవన్ కు భద్రత కల్పించడంలో పోలీసులు జాప్యం చేశారు. సొంత బౌన్సర్లే భద్రత కల్పించాల్సి వచ్చింది. అయితే తాజాగా పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల తరచూ ఇద్దరు సిఆర్పిఎఫ్ సిబ్బంది పవన్ వెంట కనిపిస్తున్నారు. అటు రాష్ట్ర పోలీసులు సైతం భద్రత పరంగా మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా చర్యలు చేపట్టిందో? తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పవన్ పర్యటనలు చేస్తున్నారు. సీఎం హోదాలో జగన్ కు ప్రత్యేక భద్రత ఉంది. అటు చంద్రబాబుకు సైతం భారీ సెక్యూరిటీ కొనసాగుతోంది. వారిద్దరితో పోల్చుకుంటే పవన్ భద్రత తక్కువగా ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు ఏపీ పోలీసులతో పాటు మరోవైపు సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం పవన్ వెంట కనిపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచార సభలకు సైతం పవన్ వెళ్ళినప్పుడు భద్రత పెంచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.