Harirama Jogaiah: ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కు వృద్ధ నేత హరిరామజోగయ్య ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వరుస లేఖాస్త్రాలు సంధిస్తూ ఇరుకున పెడుతున్నారు. గత కొద్దిరోజులుగా వరుసగా లేఖలు విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఇవి అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ కు లేఖలు రాస్తుండడం విశేషం. అయితే తొలుత హరి రామ జోగయ్య వెనుక పవన్ ఉన్నారని ప్రచారం జరిగింది. మరోవైపు ఇవే మాటలు బిజెపి నేతల నోటి నుంచి రావడంతో.. బిజెపి హై కమాండ్ ఉందని కూడా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అదే పనిగా హరిరామ జోగయ్య లేఖలు రాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పవన్ కు చికాకు పెట్టే విధంగా ఉండడంతో జన సైనికులు సైతం ఆందోళన చెందుతున్నారు. పొత్తులపై మాట్లాడవద్దని పవన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుల్లో.. హరిరామ జోగయ్య ఈ విధంగా లేఖలు రాస్తుండడం విశేషం.
గత కొన్ని రోజులుగా హరి రామ జోగయ్య జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టాలని హరి రామ జోగయ్య భావించారు. ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఎనిమిది పదుల వయసులో ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదురవుతుందని తెలిసి.. పవన్ స్వయంగా వెళ్లి నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపచేశారు. అప్పటినుంచి వారి మధ్య మంచి బంధం కొనసాగుతోంది. కానీ ఇటీవల హరి రామ జోగయ్య చర్యలు పవన్ కు ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల కూటమిలోకి బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హరి రామ జోగయ్య లేఖలు రాయడం ప్రారంభించారు. ఒకటి రెండు లేఖలు అయి ఉంటే వ్యూహం అని తేలేది. కానీ ఒకటి తరువాత ఒకటి లేఖ రాస్తూనే ఉన్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారు. దీంతో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు జనసేనలో సైతం ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అనవసరంగా హరి రామ జోగయ్యను తెచ్చి నెత్తిన పెట్టుకున్నామని జనసేన శ్రేణుల నుంచి కామెంట్ వినిపిస్తోంది. ఈ విషయంలో హరి రామ జోగయ్య వెనుక ఎవరు ఉన్నారన్న చర్చ బలంగా జరుగుతోంది. అయితే వీటిని పట్టించుకోని పవన్ పొత్తుల చర్చల్లో నిమగ్నమయ్యారు. హరి రామ జోగయ్య విషయంలో పట్టించుకోవద్దని పరోక్ష సంకేతాలు ఇచ్చినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.