Harassment Of Bears: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు బీభత్సం చేస్తున్నాయి. మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. రెండేళ్ల వ్యవధిలో పది మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా వజజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన కడమటి కోదండరావు(72)పై ఎలుగుబంటి దాడి చేయగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం 6 గంటల సమ యంలో కిడిసింగి కొండ సమీపంలో తన జీడితోట వద్దకు కోదండరావు వెళ్లారు. తర్వాత 6.30 గంటల సమయంలో స్థానిక మాజీ సర్పంచ్ నర్తు దానేష్‌కు జీడితోటలో పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఆయన గ్రామంలోకి వచ్చి.. జీడితోటలో ఎలుగు బంటి సంచరిస్తోందని, ఎవరూ అటువైపు వెళ్లొద్దని సమాచారం ఇచ్చారు. కాగా, ఉదయం 6 గంటల సమయంలో జీడితోటకు వెళ్లిన కోదండరావు ఇంటికి చేరకపోవడంతో ఆయన కుమారుడు లోకనాథం జీడితోటకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ కోదండరావు గాయాలపాలై విగతజీవిగా కనిపించాడు. సమాచా రం తెలుసుకుని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి ఆనవాళ్లు బట్టి ఎలుగుబంటి దాడి చేయడంతో కోదండరావు మృతి చెందాడని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు విషా దంలో మునిగిపోయారు. ఈ ఘటనపై లోకనాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ జున్నారావు తెలిపారు.
పట్టించుకోని అటవీ శాఖ..
ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరి స్తున్నా.. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపించారు. ఇటీవల పెద వంక గ్రామానికి చెందిన బత్తిని కామేశ్వరరావు ఎలుగుబంటి దాడికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే శివసాగర్ బీచ్‌లో ఒడిశా పర్యాటకులపై రెండు ఎలుగుబంట్లు దాడిచేశాయి. వారు ప్రస్తుతం ఒడిశా లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంకూ లూరు గ్రామానికి చెందిన ఆలయ పూజారిపై ఎలుగుబంటి దాడిచేసి గాయపరిచాయి. తాజాగా ఎలుగుబంటి దాడిలో కోదండరావు మృతి చెందా డంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Also Read: Only Nani Touched NTR Record: ఎన్టీఆర్ రికార్డు ని టచ్ చేసిన ఏకైక హీరో నానీ ఒక్కడే
జనారణ్యంలోకి..
తితలీ తుపాను తరువాత ఎలుగుబంట్లు విరవిహారం చేస్తున్నాయి. కొబ్బరి, జీడి చెట్లు లేకపోవడంతో తలదాచుకునే మార్గం లేక జనారణ్యంలోకి వచ్చి చేరుతున్నాయి. ఉద్దానంతో పాటు తీర ప్రాంతాల్లో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా సంచరిస్తున్నాయి. పట్టపగలు సంచరిస్తున్న ఉదంతాలు సైతం ఉన్నాయి. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, తీర ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత తోటలు, పొలాల్లో ఉండేందుకు ప్రజలు భయపడుతున్నారు. రెండేళ్ల కిందట సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి నరమేధాన్ని స్రుష్టించింది. తెల్లవారుజామున కాలక్రత్యాలు తీర్చుకున్న ముగ్గురిపై దాడిచేసి ప్రాణాలు బలిగొంది. చివరకు యువకుల చేతిలో చిక్కిన ఎలుగుబంటి హతమైంది. ప్రస్తుతం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో 100 వరకూ ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భల్లూకాలు మనిషి ప్రాణాలను తీస్తున్నాయి.