KGBV: పాఠశాలకు ఆలస్యంగా రావడమే ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది.ఏకంగా అక్కడ ప్రత్యేక అధికారి 18 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించింది. వారి ఆత్మ అభిమానంపై దెబ్బ కొట్టింది.ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా జిమాడుగుల మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ఉంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రత్యేక అధికారిణి ప్రసన్న కుమారి ఏకంగా 18 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రత్యేక అధికారిణిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న హెయిర్ కట్ సరిగా చేయించుకోలేదని ఓ ప్రొఫెసర్ విద్యార్థికి ఏకంగా గుండు కొట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
* వారి కోసమే ప్రత్యేక పాఠశాలలు
తల్లిదండ్రులు వలస వెళ్లినా.. అకాల మరణం చెందినా.. వారి పిల్లలకు కోసం కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. అక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన సాగుతోంది. అయితే ఈ పాఠశాలలో సకాలంలో 23 మంది విద్యార్థులుతరగతులకు హాజరు కాలేదని ప్రత్యేక అధికారి సాయి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.నలుగురు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా చాలాసేపు ఎండలో నిల్చో పెట్టారు. అందులో ఒకరు సొమ్మసిల్లి పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఏకంగా మధ్యాహ్నం భోజన సమయంలో ఓ 18 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించారు. బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అయితే దీనిని సమర్థించుకుంటున్నారు ప్రత్యేక అధికారి ప్రసన్నకుమారి. విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసమే జుట్టు కత్తిరించినట్లు చెప్పుకొస్తున్నారు.
* గాడి తప్పుతున్న పరిస్థితులు
రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల వద్ద పరిస్థితి గాడి తప్పుతుందన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది. ఇటీవల కేజీబీవీల్లో సిబ్బంది నియామకాలు జరిగాయి. ఉపాధ్యాయుల తో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది.