Gudivada Amarnath: వైసీపీ కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించనుందా?కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటున్న బీజేపీకి అంత ఈజీ కాదా? ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతికూల పవనాలు వీస్తున్నాయా? ఇప్పుడున్న మిత్రులు కూడా పెద్దగా ప్రభావం చూపలేరా? అందుకే వైసీపీ కోసం కేంద్ర పెద్దలు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది తెలియడం లేదు. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బిజెపి 300 సీట్లు దాటడం కష్టమని ప్రచారం జరుగుతుంది. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లోనే పరిస్థితి కొంత మారుతోందని వార్తలు వస్తున్నాయి. గతసారి ఆప్ ఓట్ల చీలికతో కాంగ్రెస్ నష్టపోయి బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఈసారి ఆప్ కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్నాయి. దాంతో బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలికను అడ్డుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే బీజేపీకి భారీ నష్టం గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ, యూపీ దాకా సాగుతుందం టున్నారు.
అలాగే మహారాష్ట్రతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ లలో కూడా కమలానికి ఎదురు గాలి ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 200 సీట్లు సొంతంగా… ఎన్డీయే మిత్రులకు ముప్పయి సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా కూటమి నేతలు తమదైన సర్వే రిపోర్టుని ముందుంచారు. ఎన్డీయే మిత్రులలో తెలుగుదేశం, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, మహారాష్ట్రలో ఏక్ నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన, అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. ఇవి పెద్ద పార్టీలు. కానీ వీటికి కేవలం 30 ఎంపీ సీట్లే వస్తాయంటే.. ఏపీలో కూటమికి ఛాన్స్ లేనట్టేనని కనిపిస్తోంది.అదే సమయంలో వైసీపీ ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించేలా ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఇండియా కూటమికి కానీ.. ఎన్డీయే కూటమికి కానీ సొంతంగా మెజారిటీ రాకపోతే అపుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఎన్డీయే కూటమికి 230 దాకా సీట్లు వస్తే కనుక అంటే ఏపీలోని జగన్ అవసరం కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీకి 20 సీట్లకు తక్కువ కాకుండా వస్తే మాత్రేం ఎన్డీయేకి ఈ మద్దతు ఆక్సిజన్ అవుతుందని చెబుతున్నారు. జగన్ సైతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి ఈసారి తగినన్ని సీట్లు రాకపోవచ్చు అని… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ నేతలు కేంద్రంలో ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఉండే పరిస్థితి ఉందన్నారు. తమకు ఎన్డీయే కూటమి అయినా… ఇండియా కూటమి అయినా ఒక్కటే అని తేల్చిచెప్పారు. తమ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీకి సంబంధించిన అన్ని సమస్యలు సాకారం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఆయన కంటే ముందు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విధంగా మాట్లాడారు. సో వైసిపి అవసరం వస్తే ఆలోచించేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు అయింది.