Greenfield Express Highway: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలోనే అభివృద్ధి చెందింది. ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయలా మారింది. 60 శాతం ఆదాయం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఏపీలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమీపంగా అనుసంధానం చేసే హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఈ రహదారి సామర్థ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్త హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. ఈ కొత్త రహదారి రెండు రాష్ట్రాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌గా నిలవనుందని నిపుణులు, అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే స్వరూపం ఇదీ..
హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే 230–250 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం కానుంది. ఈ నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారి, సర్వీస్ రోడ్లు లేకుండా, పట్టణాల సమీపంలో ఎగ్జిట్ రోడ్లతో రూపొందనుంది. ఈ రహదారి నిర్మాణానికి రూ.8,500 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీలో ఉన్నాయి. ఈ రహదారి ప్రస్తుత హైదరాబాద్–విజయవాడ రహదారికి సమాంతరంగా నిర్మితమవుతుంది, దీంతో ప్రయాణ దూరం 70 కిలోమీటర్లు తగ్గి, కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఒక ఆర్థిక కారిడార్‌గా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రహదారి స్టేట్ హైవేలు, జిల్లా రహదారులతో అనుసంధానం కావడం వల్ల రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ రహదారి వెంట ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందడమే కాక, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. హైదరాబాద్ శివారులో డ్రైపోర్టు, మచిలీపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఈ రహదారి ఆర్థిక ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి.
ప్రధాన ప్రయోజనాలు..
– హైదరాబాద్–అమరావతి మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గడం వల్ల ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతాయి.
– మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం ద్వారా ఎగుమతులు, దిగుమతుల ఖర్చు తగ్గి, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.
– తెలంగాణలోని ఫోర్త్ సిటీని ఈ రహదారితో జోడించడం ద్వారా హైదరాబాద్ ఆర్థిక కేంద్రంగా మరింత బలపడుతుంది.
– గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి.
– విద్య, ఆరోగ్య సౌకర్యాలకు సులభ ప్రవేశం కలుగుతుంది.
– ప్రయాణ సౌలభ్యం వల్ల సామాజిక సంబంధాలు బలపడతాయి.
Also Read: జగన్ ని కలవబోతున్న జూనియర్ ఎన్టీఆర్??
ఈ రహదారి నిర్మాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సమన్వయం కీలకం. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. కేంద్రం కూడా ఈ రహదారిని ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే విధంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఎంపికైన తర్వాత రహదారి అలైన్‌మెంట్‌పై రెండు రాష్ట్రాలతో చర్చలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల సమన్వయం, కేంద్రం సమర్థవంతమైన మద్దతుతో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, తెలుగు రాష్ట్రాలు ఆర్థిక, సామాజిక రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.