Grand welcome to Mithun Reddy: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా జరుగుతున్న అరెస్టులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు జరిగింది. కోర్టు ఆయనకు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ ఘటనపై జనసేన విపరీతంగా ట్రోల్ చేస్తోంది. కర్మ ఎవరిని విడిచి పెట్టదు అంటూ ఆ పార్టీ శ్రేణులు పోస్టులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ అంశంగా ఉంది.
సంచలన అంశమే..
అయితే మద్యం కుంభకోణంలో( liquor scam ) ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ఒక ఎత్తు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ మరో ఎత్తు. మిథున్ రెడ్డి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. పెద్దిరెడ్డి కుటుంబమంతా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులే. అందుకే వైసిపి హయాంలో రాయలసీమ వ్యవహారాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతను ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ సమయంలో రాయలసీమలో తండ్రి, గోదావరి జిల్లాలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి హవా చాటారు.
అప్పట్లో సీఎం రేంజ్ లో హడావిడి..
ముఖ్యంగా గోదావరి జిల్లాల ఇన్చార్జిగా ఉన్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( Mithun Reddy ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ చేశారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో రాయలసీమ నుంచి మనుషులు వచ్చి చేరారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాను పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గాన్ని వదిలి.. పిఠాపురం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో గోదావరి జిల్లాలో మిధున్ రెడ్డి అడుగుపెడితే చాలు సీఎం జగన్ వస్తున్నారనే రేంజ్ లో పరిస్థితి ఉండేది. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఇప్పుడు కూడా వైసిపి నేతలు బలప్రదర్శనకు దిగారు. జైలు వద్దకు క్యూ కట్టారు. అందుకే కర్మ ఎవరిని విడిచి పెట్టదు అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవే ఇప్పుడు వైరల్ అంశంగా మారాయి.