CM Chandrababu: ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డిఏ మూడోసారి అధికారంలోకి రావడానికి టిడిపి ప్రధాన కారణం. మెజారిటీకి కూతవేటు దూరంలో నిలిచింది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ.అప్పుడు చంద్రబాబుతో పాటు నితీష్ అండగా నిలబడ్డారు. అయితే రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు పరితపిస్తున్నారు.రాష్ట్రానికి అండగా నిలవాలని కేంద్రానికి కోరుతున్నారు. అయితే గతానికి భిన్నంగా కేంద్రం రాష్ట్రం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా నిధులు కేటాయిస్తోంది. మరోవైపు రాజకీయంగా కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా టిడిపికి గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు ఎంపిక ఫైనల్ కానుంది.అయితే దశాబ్ద కాలంగా ఏపీకి గవర్నర్ చాన్స్ రాలేదు. గతంలో కంభంపాటి హరిబాబును గవర్నర్ పోస్ట్ లో పంపించింది బిజెపి. అప్పట్లో టిడిపి ఎన్ డి ఏ లో ఉండడంతో పార్టీకి చెందిన మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని ప్రచారం సాగింది. కానీ 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. దీంతో ఆ పార్టీకి గవర్నర్ పోస్ట్ దక్కలేదు. ఇప్పుడు ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం, టిడిపి కీలక భాగస్వామి కావడంతో మరోసారి ఆఫర్ ఇచ్చింది కేంద్రం.
* ముగ్గురు నేతల మధ్య పోటీ
తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నేతలు గవర్నర్ పోస్ట్ ను ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా పూసపాటి అశోక్ గజపతిరాజు,యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యనమల రామకృష్ణుడు తో పాటు అశోక్ గజపతిరాజు టిడిపిలో సీనియర్లు. అశోక్ గజపతిరాజు అయితే టిడిపి వ్యవస్థాపక సభ్యుడు కూడా. అటు యనమల రామకృష్ణుడు సైతం 1983 నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ప్రభుత్వాల్లో ఈ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా. ఈ ఎన్నికల్లో స్వచ్ఛందంగా తప్పుకున్నారు. తమ వారసులకు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు గౌరవప్రదమైన రిటైర్మెంట్ కోరుకుంటున్నారు.గవర్నర్ పోస్ట్ ఇస్తే తీసుకుంటామని భావిస్తున్నారు.
*:కేంద్రం కసరత్తు
కేంద్రం కొత్త గవర్నర్ల నియామకంపై దృష్టి పెట్టింది. చాలా రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపికి ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించింది కేంద్రం. తొలుత గవర్నర్ పోస్టుకు యనమల రామకృష్ణుడు తో పాటు అశోక్ గజపతిరాజు పోటీపడ్డారు. ఇప్పుడు కొత్తగా వర్ల రామయ్య పేరు తెరమీదకు వచ్చింది. దీంతో చంద్రబాబు ఛాయిస్ ఏంటనేది తెలియాల్సి ఉంది. యనమలతో పాటు అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు నమ్మిన బంటులు.ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించిన వారే. టిడిపి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మంత్రి పదవులు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఎన్నికల్లో అది సాధ్యపడలేదు.కానీ వీరు ఈసారి పెద్ద పదవులను కోరుకుంటున్నారు.అయితే గవర్నర్ పోస్ట్..లేకుంటే రాజ్యసభ పదవి తీసుకోవాలని భావిస్తున్నారు.
* అదే జరిగితే రామయ్య
మరోవైపు కేంద్రం బిసి,ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం..చంద్రబాబు వేరే పేరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. అదే జరిగితే వర్ల రామయ్య పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన సైతం చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు. పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తూ వస్తున్న నేత. ప్రతిసారి రాజ్యసభ పదవుల సమయంలో ఆయన పేరు తెరపైకి రావడం.. ప్రకటించకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి ఉంది. అయితే కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం చెబితే గవర్నర్ పోస్ట్ కోసం వర్ల రామయ్య పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే అంతవరకు వచ్చే అవకాశం లేదని..అశోక్ గజపతిరాజు అందరికీ కావాల్సిన వ్యక్తి కావడంతో.. కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అశోక్ గజపతిరాజుకు గౌరవప్రదమైన పదవీ విరమణ గవర్నర్ పోస్ట్ తోనే ఉంటుందన్నది వాస్తవం. అందుకే ఆయన పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. అవసరమైతే యనమల రామకృష్ణుడితో పాటు వర్ల రామయ్యను రాజ్యసభకు పంపిస్తారని సమాచారం. మొత్తానికి అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ దక్కనుందన్నమాట.