New Liquor Policy: మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసిపి ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. ఈనెల 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజుతో గడువు ముగియనుంది. ఈనెల 11న లాటరీ తీసి షాపులు కేటాయించనున్నారు. 12 నుంచి షాపులు తెరిచేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రక్రియలో స్వల్ప మార్పు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తుల నమోదు ప్రక్రియలో విపరీతమైన రాజకీయ జోక్యంతో.. దరఖాస్తులు తక్కువగా రావడానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మరో రెండు రోజులపాటు పొడిగించింది. అదే సమయంలో లాటరీ తీసే తేదీని సైతం మార్చింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష దరఖాస్తులు వస్తాయని.. తద్వారా 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ తుది గడువు ముగిసే సమయానికి కేవలం దరఖాస్తుల రూపంలో 800 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరింది. దీంతో ప్రభుత్వంలో పునరాలోచన ప్రారంభమైంది. అందుకే రెండు రోజుల పాటు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
* గడువు పొడిగింపు
తొలుత 9 వరకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. దానిని రెండు రోజులు పొడిగిస్తూ 11వ తేదీకి గడువు పెంచింది. 11న డ్రా తీయాలని భావించింది.. దానిని ఈనెల 14 తేదీకి వాయిదా వేసింది. 16వ తేదీన కొత్త లైసెన్స్ దారులు దుకాణాలు ప్రారంభించుకునే అవకాశం ఇవ్వనుంది. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
* దరఖాస్తులు అంతంతే
రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. లైసెన్సుల జారీకి గాను దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు 41348 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 826 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు గడువు పొడిగించిన నేపథ్యంలో లక్ష్యం మేరకు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తోంది. తద్వారా 2000 కోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చని భావిస్తోంది.
అయితే చాలా జిల్లాల్లో షాపులకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాలో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోల్చితే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే తక్కువ దరఖాస్తులు వచ్చాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల విషయంలో ఎవరు తల దూర్చవద్దని ఆదేశించినట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం గడువు పెంచినట్లు ప్రచారం సాగుతోంది.