IAS Praveen Prakash VRS : ఏపీలో సీనియర్ మోస్ట్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. సీఎంవో ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ ఆయన లాస్ట్ వర్కింగ్ డే. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన విఆర్ఎస్ అమల్లోకి వచ్చింది. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించబడ్డారు. అయితే వైసిపి హయాంలో కీలక శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు జగన్. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. నాడు నేడు పథకాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను గాడిలో పెట్టగలిగారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారుల పట్ల అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణ ఆయనపై ఉంది. ఆయన తీరుతూ చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యావ్యవస్థలోచాలా రకాల మార్పులు తెచ్చారు.ముందుగా బయోమెట్రిక్ సిస్టం అమల్లోకి తేవడంతో ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఆకస్మిక తనిఖీలు, సస్పెన్షన్ వేటులతో విరుచుకుపడేవారు. అయితే ఇదంతా సీఎం జగన్ ఆదేశాలతోనే చేస్తున్నారని అప్పట్లో ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల్లో వైసీపీ సర్కార్ పై వ్యతిరేకత పెరగడానికి ప్రవీణ్ ప్రకాష్ విధానాలు కూడా ఒక కారణమైన విశ్లేషణలు ఉన్నాయి. జగన్ కు అత్యంత విధేయుడైన అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ మెలిగారు. వైసిపి ఓడిపోవడంతో ఇక తన పని అయిపోయిందని భావించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తెలిసి వీఆర్ఎస్తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
* కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఏడు సంవత్సరాల సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ వైపు మొగ్గు చూపారు ప్రవీణ్ ప్రకాష్. ఈ ఏడాది జూన్ 25న టిఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 30న విఆర్ఎస్ అమల్లోకి వచ్చేలా జూలై 9న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు.అయితే మధ్యలో రిటైర్మెంట్ వద్దని.. సర్వీసులో చేరుతానని తెలిసిన వాళ్లతో లాబీయింగ్ చేశారు. కానీ వైసీపీలో ఆయన చేసిన వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎటువంటి మాట ఇవ్వలేదు. దీంతో విఆర్ఎస్ అమలైపోయింది. అయితే ఆయన విఆర్ఎస్ తీసుకుని మంచి పని చేశారని.. లేకుంటే కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడాల్సి వచ్చేదని అధికార వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది.
* సీనియర్లంతా అప్రాధాన్య పోస్టులోకి
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులను లూప్ లో పెట్టింది. 19 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది. అంతటితో ఆగకుండా ప్రతిరోజు డిజిపి కార్యాలయంలోనే ఉండాలని.. ప్రతిరోజు మస్ట్ గా సంతకం పెట్టాలని షరతులు పెట్టింది. దీనిపై ఐపీఎస్ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అయితే వారిని పక్కన పెట్టిన సమయంలో.. వారంతా బెంగళూరులో జగన్ ను కలిసినట్లు ప్రచారం జరిగింది. అందుకే వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని భావించింది ప్రభుత్వం. మరోవైపు ముంబై నటి కేసులు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసు కూడా నమోదు చేసింది.
* చాలామందిలో అదే భయం
అయితే చాలామంది అధికారులు భయంతో గడుపుతున్నారు. వైసిపి హయాంలో అతిగా వ్యవహరించిన వారు ఉన్నారు. అటువంటి వారంతా విఆర్ఎస్ తీసుకోవాలని భావిస్తున్నారు. తన రెండేళ్ల సర్వీసును వదులుకొని వీఆర్ఎస్ లోకి వెళ్లిపోయేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్సార్ ఆంజనేయులుప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కొందరి ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆంజనేయులు వ్యవహరించిన తీరు వారికి తెలుసు. పైగా ఆయన ద్వారా చాలా తతంగాలు జరిగాయి. అవి బయటకు రావాలంటే ఆయన సర్వీస్ లోనే ఉండడం కరెక్టుగాని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరే కాదు చాలామంది అధికారుల పరిస్థితి ఇలానే ఉంది.