AP Volunteers: తన మానస పుత్రికగా ఉన్న వాలంటీర్లకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. నగదు పురస్కారాలు కూడా అందిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ అవార్డుల ప్రదానం కొనసాగింది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం పేరిట ఆత్మీయంగా సత్కరించనున్నారు. గురువారం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. అటు తర్వాత వారం రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేరిట అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది నగదు పారితోషికాన్ని భారీగా పెంచారు. సేవ వజ్ర కింద ఇప్పటివరకు 30 వేల రూపాయల నగదు పురస్కారం అందిస్తుండగా.. ఈ మొత్తాన్ని 45 వేలకు పెంచారు. సేవారత్న అవార్డుకు ఇచ్చే సాయాన్ని 20వేల నుంచి 30 వేలకు పెంచారు. సేవా మిత్ర నిలిచిన వాలంటీర్లకు ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి 15 వేలకు పెంచారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర కింద ఎంపిక చేసి ఒక్కొక్కరికి 45 వేల నగదు పురస్కారంతో పాటు సత్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ప్రతి మండలం లేదా మున్సిపాలిటీలో అత్యుత్తమంగా పనిచేసిన మొదటి ఐదుగురు వలంటీర్లకు 30 వేల చొప్పున నగదు బహుమతితో పాటు సన్మానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4150 మంది వాలంటీర్లకు సేవా రత్న పురస్కారాలు అందిస్తారు. సేవా మిత్ర కింద ఏడాది పాటు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన 2,50, 439 మంది వాలంటీర్లకు 15 వేల నగదు తో పాటు సత్కరించనున్నారు.
వాలంటీర్ల వందనం కార్యక్రమానికి గాను జగన్ సర్కార్ రూ.392.05 కోట్లు ఖర్చు పెడుతుండడం గమనార్హం. వీరితోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరికొందరు వాలంటీర్ల సేవలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 997 మంది వాలంటీర్లకు కన్సోలేషన్ కింద బహుమతులు అందించనున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నగదు బహుమతులు అందించనున్నారు. ఎందుకుగాను 1.61 కోట్ల నగదు బహుమతులు అందిస్తారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట సీఎం జగన్ వాలంటీర్లకు భారీ తాయిలాలు ప్రకటించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.