Good News for RTC Employees : ఉద్యోగుల విషయంలో ఏపీఎస్ఆర్టీసీ( APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చే అంత్యక్రియల ఖర్చులను పెంచింది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సైతం పెంచిన సాయం అందనుంది. ఇప్పటివరకు ఆర్టీసీ ఉద్యోగుల అంత్యక్రియ ఖర్చులు రూ.15 వేలు ఉండగా.. దానిని ఇప్పుడు రూ.25 వేలకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
2018లో చివరిసారిగా..
2018 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల( RTC employees) అంత్యక్రియలకు 15000 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చారు. కానీ మధ్యలో వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 2022 జనవరి 1 నుంచి అంత్యక్రియ ఖర్చులను అప్పటి వైసిపి ప్రభుత్వం 25 వేల రూపాయలకు పెంచింది. 2020లోనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది. అప్పటినుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. కానీ ఆర్టీసీ ఉద్యోగుల అంత్యక్రియల సాయం విషయంలో మాత్రం వైసిపి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2022 జనవరి నుంచి చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు.. మిగిలిన రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కింది. ఇకపై వారికి 25 వేల రూపాయల చొప్పున చెల్లించనున్నారు.
Also Read : అమరావతిలో ఆర్టీసీ.. ఆ ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు!
ప్రభుత్వంలో విలీనం అయినా?
వైసిపి( YSR Congress) హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది. అప్పటివరకు కార్పొరేషన్ లో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వ పరం కావడంతో.. కార్మికులంతా ఉద్యోగులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు జీతాలతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని వారు భావించారు. అయితే కార్పొరేషన్ లో ఉండేటప్పుడు వచ్చిన రాయితీలు సైతం తర్వాత నిలిచిపోయాయి. ఆపై ప్రభుత్వంలో విలీనం తర్వాత పని భారం కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. సాధారణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగా అంత్యక్రియ ఖర్చులు పెంచాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కోరాయి. కానీ జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చులను ఏకంగా 10 వేల రూపాయల పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై.. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.