Godavari Pushkaralu 2027: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కు అరుదైన గౌరవం దక్కుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంటోంది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే ముహూర్తం నిర్ణయించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. పుష్కరాల కోసం ఆరు జిల్లాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన కుంభమేళా తరహాలో ఈసారి గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
* ముహూర్తం ఫిక్స్..
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు( Godavari mahotsavam) నిర్వహించాలని నిర్ణయించారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ లో సంబంధిత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా 139 ఘాట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పది కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కాతేరుకు ఆనుకొని రెండు విఐపి ఘాట్లను నిర్మించనున్నారు.
* గత అనుభవాల దృష్ట్యా..
దాదాపు 15 నెలల కు పైగా సమయం ఉండడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చే ప్రముఖులు నేరుగా రాజమండ్రిలోకి( Rajahmundry) ప్రవేశించకుండా.. నేరుగా గామన్ బ్రిడ్జి మీదుగా పుష్కర ఘాట్లకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పలు ఘాట్లను అనుసంధానం చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రధానంగా సరస్వతి, గౌతమి ఘాట్లను అనుసంధానం చేశారు. టీటీడీ, మార్కండేయ, శ్రద్ధానంద, పద్మావతి ఘాట్ లను అనుసంధానం చేయనున్నారు. ధవలేశ్వరం దాటి బండ్ రోడ్డును 37 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించనున్నారు. కుంభమేళా తరహాలో ఎంత మంది భక్తులు వచ్చినా.. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. పుష్కరాల సమయంలో టెంట్ సిటీలు,, హోమ్ స్టే లు సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం.