Glass Symbol: జనసేనకు 21 సీట్లు.. గాజు గ్లాస్ గుర్తు మాత్రం అన్నిచోట్ల.. అదెలా?

గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్లు దక్కకపోవడంతో.. జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ.

Written By: Dharma, Updated On : April 21, 2024 2:03 pm

Glass Symbol

Follow us on

Glass Symbol: ఏపీలో కూటమి పక్షాలకు షాక్. ఆ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే ఛాన్స్ కనిపించడం లేదు. గాజు గ్లాస్ గుర్తు విషయంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణం. అసలు ఆ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఊహించలేదు. ఒకవేళ కుదిరినా సీట్ల సర్దుబాటు సక్రమంగా జరుగుతుందని ఆశించలేదు. కానీ వాటన్నింటిని అధిగమించి ఆ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. అయితే ఓట్ల బదలాయింపు విషయానికి వచ్చేసరికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జనసేన గాజు గ్లాస్ గుర్తు.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సైతం బరిలో ఉంటుంది. జనసేన పొత్తులో భాగంగా 21 సీట్లలో పోటీ చేస్తున్న చోట్ల ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. జనసేన పోటీచేయని చోట సైతం ఇండిపెండెంట్ లకు ఆ గుర్తు వెళ్తుంది.

గత ఎన్నికల్లో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్లు దక్కకపోవడంతో.. జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. ఈ లెక్క ప్రకారం జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఆ గుర్తు కొనసాగుతుంది. పోటీ చేయని చోట్ల మాత్రం ఇండిపెండెంట్లుకు ఆ గుర్తు వెళ్తుంది. అయితే ప్రస్తుతం మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఇది ఇబ్బందికర పరిణామం. జనసేన 21 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ ఇండిపెండెంట్ లను పెట్టే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆ పార్టీ అస్సలు వదులుకోదు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సైతం జనసేన పోటీ చేయలేదు. అక్కడ ఇండిపెండెంట్ గాపోటీ చేసే వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. కనీసం ప్రచారం చేయకుండానే ఆ గుర్తుకు 2500 ఓట్లు దక్కాయి. అందుకే ఇప్పుడు జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.

కొద్దిరోజుల కిందట గాజు గ్లాస్ గుర్తు విషయంలో రగడ జరిగింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును తమకే కేటాయించాలని జనసేన ఎలక్షన్ కమిషన్ ను కోరింది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును జనసేన కేటాయించింది. అయితే ఆ గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని తామే ముందుగా కోరామని మరో పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అంతకంటే ముందే జనసేన దరఖాస్తు చేసిందని చెబుతూ కీలక ధ్రువపత్రాలను ఈసి కోర్టుకు నివేదించడంతో.. గాజు గ్లాస్ గుర్తును తిరిగి జనసేనకు కేటాయిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాస్ గుర్తును.. శాశ్వతంగా తమకే కేటాయించాలని జనసేన కోరుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు విన్నవించింది. అక్కడ నుంచి సానుకూలత వస్తుందని ఆశాభావంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.