Jagan: పేరు, ఫొటోలు తీసేయండి.. జగనన్న కనుమరుగు

వైసిపి హయాంలో ప్రధాన సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరుతో కొనసాగించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్య టిడిపి అమలు చేసిన పథకాలకు సైతం పేర్లు పెట్టుకున్నారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 9:10 am

Jagan

Follow us on

Jagan: ఏపీలో పాలన ప్రారంభమైంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. పోలవరం సందర్శనతో క్షేత్రస్థాయి పర్యటనలను చంద్రబాబు ప్రారంభించారు. మరోవైపు గత వైసిపి సర్కార్ ఆనవాళ్లను దాదాపు చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల నుంచి జగన్ ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా జగన్ ఫోటోలతో ఉన్న ధ్రువీకరణ పత్రాలు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయాలకు ఇచ్చిన హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు.

వైసిపి హయాంలో ప్రధాన సంక్షేమ పథకాలను రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరుతో కొనసాగించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్య టిడిపి అమలు చేసిన పథకాలకు సైతం పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లు తొలగించి యధాతధంగా పాత పేర్లను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో పార్టీ జెండా రంగులను తీసేయాలని కూడా ఆదేశించింది. రైతుల పాసుపుస్తకాలపై, లబ్ధిదారుల కార్డులపై, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడిన సర్టిఫికెట్ల పై పార్టీ జెండాలకు సంబంధించి రంగులు ఉన్నట్లయితే.. వాటిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించడం విశేషం.

వైసీపీ హయాంలో అమలైన జగనన్న విద్యా దీవెన, వైయస్సార్ భరోసా, జగనన్న ఇళ్లు.. ఇలా జగనన్న పేరుతో కొనసాగిన అనేక పథకాల పేర్లలో జగనన్న పేరు పూర్తిగా కనుమరుగు కానుంది. జగన్ ఫోటోలను సైతం పూర్తిగా తొలగించనున్నారు. అన్నింటికీ మించి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన నేపథ్యంలో.. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తొలగించనున్నారు. సామాజిక పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన కార్డులపై జగనన్న పేరు, ఫోటో సైతం కనుమరుగు కానుంది. మొత్తానికైతే ఐదు సంవత్సరాల పాటు జగన్ పేరుతో, ఫోటోలతో సాగిన ప్రచారాన్ని చంద్రబాబు సర్కార్ చెక్ చెప్పింది.