Ayyannapatrudu: నడిరోడ్డు పై బూతులు.. అయ్యన్న స్పీకర్ అయితే ఎట్లుంటదో?

సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు. టిడిపి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మంత్రిగా ఛాన్స్ దక్కేది. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 9:05 am

Ayyannapatrudu

Follow us on

Ayyannapatrudu: ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక దాదాపు ఖరారు అయ్యింది. సీనియర్ నేతగా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు ఆయన. అయితే ఆయన వ్యవహార శైలి దూకుడుగా ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై వీరుచుకుపడే తీరు భిన్నంగా ఉంటుంది. అయితే ఓ బాధ్యతాయుతమైన పదవి చేపట్టనున్న అయ్యన్న.. అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. చెప్పరాని భాషలో అధికారులను బూతులు తిట్టారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు. ఇష్టం లేకపోతే దె..యండి అంటూ పెద్దగా అరుస్తూ నానా హంగామా చేశారు. తాను త్వరలో స్పీకర్ అవుతున్నానని.. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకు నిలబడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు. టిడిపి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మంత్రిగా ఛాన్స్ దక్కేది. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు. స్పీకర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయింది. దానిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయ్యన్నపాత్రుడు. అదే మాదిరిగా తనపై వ్యక్తిగత దాడికి వైసిపి ప్రభుత్వం అధికారులను వాడుకుంది. ముఖ్యంగా ఆర్ అండ్ బి అధికారుల ప్రోత్సాహంతో అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చి వేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు అధికారం మారింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసిపి అధికారానికి దూరమైంది. అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు అదే అధికారులు ఆయనకు టార్గెట్ అయ్యారు. నడిరోడ్డుపై అయ్యన్నపాత్రుడు బూతు పురాణానికి దిగడంతో అధికారులు అసౌకర్యానికి గురయ్యారు. తీవ్ర అవమానం పడ్డారు.

నర్సీపట్నంలో రహదారుల దుస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు అయ్యన్నపాత్రుడు. మంగళవారం ఆర్ అండ్ బి, మునిసిపల్ రోడ్లను పరిశీలించారు. రోడ్డు నాణ్యత ప్రమాణాలపై అయ్యన్న ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారుల నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో ఓట్ల కోసం అర్ధరాత్రి రోడ్డు పనులు చేశారు కదా అంటూ నిలదీసినంత పని చేశారు. పనుల్లో నాణ్యతలేని కారణంగా బిల్లులు చేయకూడదని ఆదేశించారు.సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం ఎన్నికల కోసమే ఈ పనులు చేపట్టారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో తన ఇంటి పై దాడి, ప్రహరీ ధ్వంసం వంటి ఘటనల్లో ఆర్ అండ్ బి, మునిసిపల్ అధికారుల పాత్ర ఉంది. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ఎన్నికకు కావడం, స్పీకర్ గా పదవి చేపట్టనుండడంతో అధికారులపై విశ్వరూపం ప్రదర్శించారు. అయితే అధికారుల తప్పిదాలను ఎత్తిచూపి చర్యలు తీసుకోవాలి తప్ప.. ఇలా నడిరోడ్డుపై బూతులు తిట్టడం ఏంటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిని స్వీకరించక ముందే నోరు పారేసుకోవడం సరికాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్పీకర్ గా ఎలా వ్యవహరిస్తారో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.