Ganta Srinivasa Rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( ganta Srinivasa Rao ) క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారా? తన కుమారుడికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. గంటా ఏ పార్టీలో ఉన్నా విజయం మాత్రం ఆయన సొంతం. మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచారు ఆయన. మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో దక్కలేదు. అయితే 2029 ఎన్నికల్లో తన బదులు కుమారుడ్ని రంగంలోకి దించేందుకు ఇప్పటినుంచి గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన కుమారుడిని లోకేష్ టీమ్ లోకి పంపించినట్లు సమాచారం. మొన్నటికి మొన్న విశాఖలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను పొగుడుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి.
* సుదీర్ఘ నేపథ్యం..
గంటా శ్రీనివాసరావు ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆయన ఓటమి ఎరుగని నేతగా పేరు పొందారు. తొలుత చోడవరం ఎమ్మెల్యేగా, తరువాత అనకాపల్లి ఎంపీగా, భీమిలి ఎమ్మెల్యేగా, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడిగా, ఇప్పుడు మరోసారి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే తొలుత టిడిపి, తరువాత పిఆర్పి, అటు తరువాత కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ గూటికి వచ్చారు. అయితే మధ్యలో పార్టీ మారడం, టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండడం గంటాకు మైనస్ గా మారింది. అందుకే ఈసారి మంత్రి పదవి రాలేదు. అయితే అన్ని పదవులు ఆశించిన గంటా శ్రీనివాసరావు ఈసారి తెర వెనుక రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నారు. తన కుమారుడిని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.
* విశాఖవ్యాప్తంగా ఫ్లెక్సీలు..
మొన్నటికి మొన్న మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) విశాఖకు వచ్చారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో గంటా బదులు ఆయన కుమారుడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తద్వారా యువనేత లోకేష్ కు దగ్గర చేసే ప్రయత్నం చేశారు. పైగా విశాఖ నగరవ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. నాడు తండ్రి హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మిస్తే.. నేడు కుమారుడు గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు రప్పించి అందరి మనసులు గెలుచుకున్నారని రాయించారు. అయితే ఇదంతా కుమారుడు పొలిటికల్ ఎంట్రీ కోసమేనని ప్రచారం నడుస్తోంది. లోకేష్ టీం ద్వారా 2029 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేయించి.. ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని గంటా శ్రీనివాసరావు ఆరాటపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.