Pakistan Cricket : అసలే ఆ దేశంలో క్రికెట్ సౌకర్యాలు అంతంత మాత్రం. ఆ దేశంలోకి వచ్చి క్రికెట్ ఆడే జట్లు కూడా అత్యంత తక్కువ. పైగా శాంతిభద్రతల లోపం వల్ల ఎక్కడ కాల్పులు జరుగుతాయో తెలియదు. ఉగ్రవాదులు ఏం మూలకు వచ్చి దాడులు చేస్తారో తెలియదు. ఎక్కడ ఎటువంటి బాంబులు పేలుతాయో అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గడ్డమీద అడుగుపెట్టి.. క్రికెట్ ఆడాలని ఏ జట్టు కూడా కోరుకోదు. పైగా చాలా సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో పర్యటించడానికి వచ్చిన శ్రీలంక క్రికెటర్ల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోదు. ఆ ఘటన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఐసీసీ పాకిస్తాన్ దేశంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధ విధించింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం అనంతరం ఆ నిషేధం ఎత్తివేసింది.
సరిగ్గా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆఫ్గనిస్తాన్ దేశానికి చెందిన క్రికెటర్లు ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ మీద యావత్తు ప్రపంచానికి ద్వేషం మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ జట్టు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవడం లేదు. త్వరలోనే పాకిస్తాన్ వేదికగా శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రై వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు అని అనుకున్నట్టు జరిగితే ఆఫ్గనిస్తాన్ హాజరయ్యేది. ట్రయాంగిల్ పోటీలో పాల్గొనేది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ సైన్యం చేసిన దాడుల్లో ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు చనిపోయారో.. అప్పుడే ఆఫ్గనిస్తాన్ జట్టు ఆలోచన విధానం మారిపోయింది. పాకిస్తాన్ జట్టుతో ఆడే ట్రై సిరీస్ లో కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ జట్టుతో జరిగే ట్రై సిరీస్లో ఆడేది లేదని ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కాళ్ళ కింద భూమి కంపించి పోయినట్టు అయింది. నవంబర్ 17 నుంచి 29 వరకు ఈ ట్రై సిరీస్ నడుస్తుంది. అయితే ఆఫ్గనిస్తాన్ స్థానంలో మరో జట్టును ఆడించేందుకు అనేక బోర్డులతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఏ జట్టు కూడా ఆడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న పంతం మొత్తం మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో టీమిండియా పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్ ఆడింది. మూడు మ్యాచ్లో కూడా పాకిస్తాన్ జట్టు టీం ఇండియా మీద ఓడిపోయింది. అంతేకాదు పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా టీం మీడియా కెప్టెన్ ఆసక్తిని చూపించలేదు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత కూడా ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్లు ఆసక్తిని చూపించలేదు. తద్వారా పాకిస్తాన్ అంటే తాము ఎంత ఈసడించుకుంటున్నామో టీమిండియా ప్లేయర్లు నిరూపించారు. ఇప్పుడు అదే దారిని ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు అనుసరిస్తున్నారు.