Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు గెలుపు వీరుడు గా పేరు తెచ్చుకున్నారు. 1999 నుంచి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పవర్ పాలిటిక్స్ కు గంటా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగుతుంటారు. ఒక ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గంలో.. మరోసారి చేయరు. ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల్లో ఇదేవిధంగా మార్చుతూ వచ్చారు. ఈసారి దానికి విరుద్ధంగా వెళుతున్నారు. గతంలో తాను పోటీ చేసిన భీమిలి నుంచే మళ్లీ బరిలో దిగుతున్నారు. దీంతో మరోసారి గెలిచి రికార్డు బ్రేక్ చేస్తారా? ఓటమి చవిచూసి ఆనవాయితీకి ముగింపు పలుకుతారా అన్నది చూడాలి.
1999 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేశారు గంటా. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2004లో మాత్రం అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. చోడవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టిడిపిలో చేరారు. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పటివరకు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత… గంటా అదే స్థానం నుంచి పోటీ చేయలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆనవాయితీని పక్కన పెట్టారు. భీమిలి అసెంబ్లీ సీటు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయరన్న ఆనవాయితీని గుర్తు చేసుకునే చంద్రబాబు గంటాకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును కేటాయించారు. కానీ గంటా మాత్రం వెనుకడుగు వేశారు. బొత్సను తట్టుకోలేనని ముందుగానే చేతులెత్తేశారు. సులువుగా ఉంటుందని భీమిలిని అడిగారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనపై వ్యతిరేకత ఉంది. ఆపై జనసేనతో పొత్తు గెలుపు సునాయాసం అవుతుందని గంటా భావించారు. అందుకే చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. అనుకున్నది సాధించగలిగారు.అయితే ఈ క్రమంలో గతంలో తాను పోటీ చేసిన నియోజకవర్గం అన్న సెంటిమెంటును మరిచిపోయారు. ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. అయితే సెంటిమెంట్ ను అధిగమించిన నేపథ్యంలో గెలుపొందుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.