https://oktelugu.com/

Rain In Telugu states : తెలంగాణలో ఫుల్లు వర్షాలు.. ఏపీలో ఫుల్ హీట్.. అంతా ‘బాబే’ చేశాడా? ట్రోల్స్*

 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడుతుండగా.. ఏపీలో మాత్రం మేఘాలకే పరిమితం అవుతున్నాయి. అయితే చంద్రబాబు అధికారంలోకి రావడం వల్లే ఈ పరిస్థితి అని ప్రత్యర్థి వైసీపీ ఆరోపిస్తుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 20, 2024 / 04:18 PM IST

    Chandrababu coming rains going

    Follow us on

    Rain In Telugu states :  ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి.కానీ ఒక్క ఏపీలో తప్ప. దేశంలో అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పక్క  రాష్ట్రం తెలంగాణలో సైతం విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో వర్షం కురవకపోగా.. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మరో మినీ వేసవి కాలాన్ని తలపిస్తోంది పరిస్థితి. 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా.. చాలా ప్రాంతాల్లో ఉబాలు జరగలేదు. కనీసం పొలాల్లో చుక్కనీరు కనిపించడం లేదు. కేవలం నదులు, కాలువల పరివాహక ప్రాంతాల్లో మాత్రమే  దమ్ములు సాగాయి. మిగతా ప్రాంతాల్లో కరువు వాతావరణం తలపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు కొత్త ప్రచారానికి తెర తీశాయి. కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. చంద్రబాబు అడుగుపడితే కరువు విలయతాండవం చేస్తుందని  ప్రచారం చేస్తున్నాయి.గతంలో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తో పాటు ఇతరులు సీఎంగా ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడ్డాయని.. ఒక్క చంద్రబాబు హయాంలోనే వర్షాలు ముఖం చాటేస్తుండడాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. లెగ్గు మహిమ అంటూ  బ్రహ్మానందం రీల్స్ ను జత చేస్తూ సాగుతున్న ఈ ప్రచారం ఇటీవల ఎక్కువవుతోంది.
     * అప్పట్లో ఇదే ప్రచారం
    2004 ఎన్నికల సమయంలో సైతం చంద్రబాబుపై ఇదే తరహా ప్రచారం ఉండేది. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. 1999 నుంచి 2004 మధ్య  వర్షాల జాడ కరువైంది. అప్పట్లో కరువు చాయలు నెలకొన్నాయి. అప్పట్లోనే చంద్రబాబుపై ఒక రకమైన అపవాదు ఏర్పడింది. ఆ ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది.
     * ఎన్నికల్లో ఇదే హైలెట్
    ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇదే అంశం హైలెట్ అవుతుంది. చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే వర్షాలు కురవని.. కరువు తప్పదని హెచ్చరిస్తూ రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. అయితే 2014లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ఆ ఐదేళ్ల పాటు వర్షాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది.  దీంతో ఆయనపై ఉన్న విమర్శ పెద్దగా బయటకు కనిపించలేదు. అయిదేళ్ల పాటు వర్షాలు బాగానే కురిశాయి. పంటలు బాగానే పండాయి.
     * చుట్టుపక్కల రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

     ఈ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ విక్టరీ సాధించారు. వై నాట్ 175 అన్న వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయ్యింది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజలు మాత్రం అభివృద్ధికి  జై కొట్టారు. జగన్ సర్కార్ అభివృద్ధి చేయలేదన్న ఒకే ఒక కారణంతో  దారుణంగా ఓడించారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీలో మాత్రం ముఖం చాటేస్తున్నాయి. ఓటమితో నైరాస్యంలో ఉన్న వైసీపీ శ్రేణులు.. చంద్రబాబు అడుగు పెట్టిన వేళా విశేషం  అంటూ.. వర్షాలు లేకపోవడాన్ని, కరువు ఛాయలను అతడి పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి