Telangana Speaker : వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకు కావాల్సినవి వస్తాయి అంటారు. ఇప్పుడు రుణమాఫీ సంగతి కూడా అలాగే ఉంది. అనర్హులంటూ రైతులకు రుణ మాఫీని దూరం చేస్తున్న రేవంత్ సర్కార్.. అయిన వారికి మాత్రం పైసా నష్టం లేకుండా చేస్తుంది. రుణమాఫీలో పేదోడి పొట్టగొడుతూ పెద్దోళ్ల గల్లాలు నింపుతోంది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కాలేదని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, పార్టీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి తన విశాల హృదయాన్ని చాటుకుంది రేవంత్ సర్కార్. పేదల పక్షం అని చెప్పుకోవడం తప్ప చేతల్లో మాత్రం ఏం లేదన్న విమర్శలకు నిదర్శనంగా నిలుస్తోంది. బడా బాబులకు రుణమాఫీ చేస్తూ.. చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తోంది. పెద్ద పెద్ద బంగళాల్లో, మందీమార్బలం ఉండే ఎమ్మెల్యేలకు రుణ మాఫీ చేసిన ప్రభుత్వం సాదాసీదా రైతాంగాన్ని మాత్రం బ్యాంకుల చుట్టూ తిప్పిస్తోంది. సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రుణమాఫీ అయ్యిందన్న వార్త సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఈ జాబితాలో చాలా మంది అధికార ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లకు రుణమాఫీ చేస్తూ, పేద, దిగువ మధ్యతరగతి రైతులకు అన్యాయం చేసిందని మండిపడుతున్నారు.
సర్వత్రా చర్చ..
తెలంగాణలో చాలా మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు, నేతలకు మాత్రం రుణమాఫీ కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లాంటినేతలు ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాండూరు డీసీసీబీ బ్యాంకులో ఆయనకు రూ.1.50 లక్షల రుణం మాఫీ అయ్యింది. ఇక ఈ జాబితాలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం(రూ.4,00,000), కవ్వంపల్లి సత్యనారాయణ(రూ.1,27, 119), వేముల వీరేశం(రూ.1,20,000), గండ్ర సత్య నారాయణ (రూ.1,50,000), రాందాస్ మాలోత్ (రూ.2,64,292), (రూ.1,31,368), కోరం కనకయ్య(రూ.2,12,780) కూడా ఉన్నారు. వీరికి సంబంధించిన డాక్యుమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రైతుల కోసమా.. ఎమ్మెల్యేల కోసమా..
ఎమ్మెల్యేలకు రుణమాఫీ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసింది రైతుల కోసమా, లేక కాంగ్రెస్ ఎమ్యెల్యేల కోసమా అన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఆసాములకు కూడా రుణమాఫీ అవుతోంది కానీ, తమకు మాత్రం కావడం లేదని రైతులు వాపోతున్నారు. అనర్హులుగా తమను జాబితాలో తొలగించిన ప్రభుత్వం… ట్యాక్సులు కట్టగల, డబ్బు, దస్కమున్న ఈ పెద్దలకు ఎలా రుణమాఫీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తమను మాత్రం బ్యాంకుల చుట్టూ తిప్పుతూ, వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్లమనే చెప్పే ప్రభుత్వం వాళ్లకు ఎలా చేస్తుందని నిలదీస్తున్నారు.